హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్కువ కట్టెల వినియోగంతో పనిచేసే ఆధునిక వంటపొయ్యిలను ప్రోత్సహిస్తున్నాయి పలు కంపెనీలు. కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఉచితంగా ఈ ఆధునిక స్టౌలను పంపిణీచేస్తూ కార్బన్క్రెడిట్లను సంపాదిస్తున్నాయి. ఒక్కో స్టౌ వినియోగం ద్వారా ఏడాదికి 2 నుంచి 4 కార్బన్క్రెడిట్స్ (స్టౌ రకాన్నిబట్టి) సంపాదించే వీలుండగా, ఒక్కో కార్బన్క్రెడిట్ను 8-10 డాలర్లకు మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్కు చెందిన కోర్ కార్బన్ఎక్స్ సొల్యూషన్స్ కంపెనీ ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో 20 లక్షల ఆధునిక స్టౌలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
వీటివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా వంట చెరకు కోసం చెట్లను కొట్టడం కూడా బాగా తగ్గుతుంది. కెనడాకు చెందిన విడా కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కోర్ కార్బన్ఎక్స్ ఎండీ నీరజ్ మొహంతి చెప్పారు. ఇంధన సామర్థ్యంగల ఒక్కో స్టౌ ధర మార్కెట్లో రూ.1200 నుంచి రూ.1600 వరకూ ఉన్నట్టు తెలిపారు. గత ఏడాది నుంచి ఈ స్టౌల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. 11 మిలియన్ డాలర్లు సంపాదించాలనే లక్ష్యంతో భారత్లోని మారుమూల ప్రాంతాల్లో 60 వేలు, మయన్మార్లో 30 వేల స్టౌలను పంపిణీ చేసినట్టు చెప్పారు.