FPI Out Flows | జపాన్ కరెన్సీ ‘యెన్’ క్యారీ ట్రేడ్.. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) వాటాలను నిరంతరం విక్రయిస్తున్నారు. ఆగస్టులో ఇప్పటి వరకూ రూ.21,201 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. జూన్ నెలలో రూ.26,565 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్ల విలువైన షేర్లును ఎఫ్‌పీఐలు కొనుగోలు చేశారు.జాతీయంగా రాజకీయ సుస్థిరత, సుస్థిర ఆర్థిక వృద్ధిరేటు, యధాతథంగా ఆర్థిక సంస్కరణల పథం ముందుకు సాగుతుందన్న అంచనాల మధ్య గత రెండు నెలల్లో ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు.
అంతకుముందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో రూ.8700, మేలో రూ.25,586 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించారు. యూఎస్ బాండ్ల విలువ స్థిరంగా పెరగడం, మారిషస్ తో పన్ను చట్టాల ఒప్పందంలో మార్పులు చేస్తారన్న అంచనాల మధ్య ఏప్రిల్, మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 17 వరకూ ఎఫ్ పీఐలు నికరంగా రూ.21,201 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.14,364 కోట్ల పెట్టుబడులు పెట్టారు.