FPI Investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏప్రిల్ నెలలో రూ.11,631 కోట్ల విలువ చేసే స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు గరిష్టం. ముఖ్యమైన కంపెనీల స్టాక్స్ అందుబాటు ధరలోకి రావడం, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ బలోపేతం కావడం విదేశీ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. కానీ, మార్చి నెలలో ఎఫ్‌పీఐలు రూ.7,936 కోట్ల విలువైన షేర్లు మాత్రమే కొనుగోలు చేశారు. జీక్యూజీ పార్టనర్స్ నుంచి అదానీ గ్రూప్‌లోకి భారీగా వచ్చిన నిధుల వల్లే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దారి తీశాయి. వీటిని మినహాయిస్తే మార్చిలో విదేశీ ఇన్వెస్ట్మెంట్ నెగెటివ్‌గా నమోదయి ఉండేది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు మరికొంత కాలం కఠిన నిర్ణయాలు కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అదే జరిగితే దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్ట్మెంట్లలో ఒడిదొడుకులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారత్ ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందన్నారు. కనుక మన దేశీయ స్టాక్ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏప్రిల్ తొలి 15 రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్ కొనుగోళ్లు చేశారు. ఇండెక్స్‌లు బలంగా పుంజుకున్నా.. మూడో వారం ఆ ఉత్సాహం తగ్గుముఖం పట్టింది. అధిక వడ్డీరేట్లు, అమెరికాలో బలహీన ఆర్థిక గణాంకాలు మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచాయి. తిరిగి నెలాఖరులో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది.