Foxconn | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘దేశంలో పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ’ అనే ప్రభ క్రమంగా మసకబారుతున్నది. ఒకప్పుడు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఏ విదేశీ సంస్థ ముందుకొచ్చినా తొలుత తెలంగాణను (Telangana) పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఇతర రాష్ర్టాలతో చర్చలు జరపడం ఆనవాయితీ అంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ (Congress) పాలనలో పరిస్థితి మారింది. నాడు పోటీపడి జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించిన రాష్ట్రం.. నేడు కనీసం ఉన్న కంపెనీల విస్తరణను కూడా నిలుపుకోలేని స్థితికి వెళ్లిపోతున్నది. ఇందుకు ఫాక్స్‌కాన్ సంస్థే (Foxconn)తాజా ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ర్టానికి తరలివచ్చిన ఈ తైవాన్ కంపెనీ.. ఇప్పుడు విస్తరణ కోసం తమిళనాడును ఎంచుకున్నది. రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. అయితే తెలంగాణలోనే అదనపు పెట్టుబడులు పెట్టేలా కంపెనీని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఇలా జరిగిందని పరిశ్రమ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడుల గమ్యస్థానంగా మారగా.. ఇప్పుడు ప్రముఖ కంపెనీలు ఇతర రాష్ర్టాలవైపు మళ్లుతున్నాయని చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీస్ వంటి పలు దిగ్గజ కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోయిన సంగతి తెలిసిందే.
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూపు) ప్రఖ్యాత యాపిల్ ఐఫోన్ల తయారీని చేపడుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్చి 2023లో తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు స్వయంగా వచ్చి, అప్పటి సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వాసంతో సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకొచ్చింది. ఒప్పందం ప్రకారం అప్పుడే ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌కు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో 186.7 ఎకరాలు కేటాయించింది. దీంతో గత ఏడాది నుంచి ఫాక్స్‌కాన్ సంస్థ యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్రారంభించింది. నిజానికి రాష్ట్రంలో దశలవారీగా కార్యకలాపాలను విస్తరిస్తామని అప్పట్లో సంస్థ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఫాక్స్‌కాన్ సంస్థ తమ కంపెనీ విస్తరణ కోసం తెలంగాణను పక్కనబెట్టి ఇతర రాష్ర్టాల్లో ప్రయత్నాలు ప్రారంభించింది. మొదట కర్నాటక సీఎంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఒప్పందం చేసుకున్నది. అయితే తెలంగాణ ప్రభుత్వంతో కనీసం చర్చలు కూడా జరపకపోవడం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది. మన రాష్ట్రంలో విస్తరణకు అవకాశాలున్నా తమిళనాడులో డిస్ప్లే మాడ్యూల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.15వేల కోట్ల తో ముందుకెళ్లడం గమనార్హం. ఇందులో సుమారు 14వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇదిలావుంటే ఫాక్స్‌కాన్ తాజా పెట్టుబడుల వ్యవహారంపై హైడ్రామా నడుస్తున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో తమ నూతన భారతీయ ప్రతినిధి రాబర్ట్ వూ మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారని, ఈ సందర్భంగా ఎలాంటి పెట్టుబడులపై చర్చ జరగలేదని ఫాక్స్‌కాన్ ప్రకటించింది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా.. తమిళనాడులో ఫాక్స్‌కాన్ రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని, 14 వేల ఉద్యోగావకాశాలు రానున్నాయని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. అయితే దీనిపై రాజా మళ్లీ స్పందిస్తూ.. పెట్టుబడుల మాట ముమ్మాటికీ నిజమేనని చెప్పడం గమనార్హం. దాదాపు ఏడాదిపాటు చేసిన కృషికి ఇది ఫలితమని ఆయన అంటున్నారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా పేరున్న ఫాక్స్‌కాన్.. తెలంగాణలో పెట్టుబడి పెట్టడం ఓ గొప్ప మైలురాయిగా పరిశ్రమ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఫాక్స్‌కాన్ కస్టమర్లలో గూగుల్, అమెజాన్, హువావే, అలీబాబా గ్రూప్, సిస్కో, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర ప్రధాన కంపెనీలున్నాయి. ఇది ప్రస్తుతం భారత్ సహా చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, యూరప్, మలేషియా, అమెరికా తదితర 24 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. మన దేశంలో తమిళనాడు, కర్నాటక తరువాత తమ పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోవడం విశేషం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు భారీగా విస్తరించాయి. అనేక దేశీయ కంపెనీలతోపాటు సీమెన్స్, ఏబీబీ, ఎన్ఎక్స్బీ సెమీకండక్టర్స్, మోటరోలా మొబిలిటీ, సిలికాన్ ల్యాబ్స్, ఇన్ఫినియన్ టెక్నాలజీస్ తదితర బహుళజాతి కంపెనీలు ప్రస్తుతం తెలంగాణలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫాక్స్‌కాన్ మన రాష్ట్రంలో భారీగా విస్తరణ ప్రణాళికలను కూడా రూపొందించింది. ఇంతలోనే మన రాష్ర్టాన్ని కాదని ఇతర రాష్ర్టాలవైపు మొగ్గుచూపడం పరిశ్రమ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఫాక్స్‌కాన్ వంటి పెద్ద కంపెనీల పెట్టుబడితో అనేక ఇతర కంపెనీలు రాష్ర్టానికి వచ్చే వీలుంటుందని, అంతేకాకుండా అనేక యాన్సిలర్ యూనిట్లు కూడా ఏర్పాటవుతాయని చెప్తున్నారు. ప్రముఖ కంపెనీలు ఇతర రాష్ర్టాలకు వెళ్తే సహజంగానే ఆ ప్రభావం మన రాష్ట్రంపై ఉంటుందని, కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని అంటున్నారు.