Foxconn EV Car | ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) ట్రెండ్ సాగుతున్నది. వివిధ కార్ల కంపెనీలు, టూ వీలర్స్ తయారీ సంస్థలు అధునాతన ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తేవడంలో పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలోకి ఫాక్స్‌కాన్ కూడా వచ్చి చేరింది. ఫాక్స్‌కాన్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ కన్సార్టియం ఎంఐహెచ్ ( MIH ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. మార్కెట్లోకి మూడు సీట్లతో కూడిన సింగిల్ రో కారు తేనున్నట్లు వెల్లడించింది. ఆసియా దేశాల్లోని సింగిల్ చైల్డ్ ఫ్యామిలీస్‌కు ఈ బుల్లి కారు పాపులర్ కానున్నది. జపాన్‌తోపాటు భారత్, థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియా వంటి మార్కెట్లలోకి ఈ త్రీ సీటర్ కారును తీసుకెళ్లాలని తలపోస్తున్నది.
ఆసియా దేశాల్లో స్మాల్ ఎలక్ట్రిక్ కార్లకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ `ఎంఐహెచ్` కన్సార్టియం `ప్రాజెక్ట్ ఎక్స్` పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారు తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని కూడా యోచిస్తున్నది. దీని ధర 20 వేల డాలర్ల లోపే ఉంటుందని అంచనా.
తైపైలో జరిగిన వేడుకలో ఈ కారును ఆవిష్కరించింది. కస్టమర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కారును తయారు చేస్తామని ఎంఐహెచ్ సీఈవో జాక్ జెంగ్ వెల్లడించారు. అమెరికన్లు అతిపెద్ద కార్లంటే ఎక్కువగా ఇష్ట పడతారని చెప్పారు. సింగిల్ చైల్డ్ ఫ్యామిలీకి ఈ కారు అనువుగా ఉంటుందన్నారు.
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరర్ కాంట్రాక్ట్ సంస్థ. ఆపిల్ ఐ-ఫోన్ల సరఫరాదారు. ఇటీవల సెమీ కండక్టర్లు, ఈవీ రంగాల్లో పెట్టుబడులు పెంచేసింది. భారత్ కార్పొరేట్ సంస్థ వేదంతాతోపాటు అమెరికా స్టార్టప్ ఫిస్కర్ ఇంక్‌తో కలిసి భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది.