Foxconn | ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ తమ కంపెనీలో ఉద్యోగ నియామకాల విధానాన్ని సమర్థించుకున్నారు. తమిళనాడులోని ఐ-ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లో వివాహితులైన మహిళల నియామకానికి తిరస్కరించిందని ‘రాయిటర్స్’లో వార్తాకథనం వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని తమ ఆపిల్ ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ లో పని చేసే ఉద్యోగుల కోసం నిర్మించిన హాస్టల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో ఉద్యోగ నియామకాల్లో లింగ వివక్షకు తావు లేదు. తమ సంస్థలో పని చేసే వారిలో మహిళలే అత్యధికులు అని చెప్పారు. మహిళా ఉద్యోగులే ఎక్కువగా పని చేస్తారని పేర్కొన్నారు. చెన్నైకి సమీపాన ఐ-ఫోన్ మేకింగ్ ప్లాంట్ వద్దే ఈ బహుళ అంతస్తుల హాస్టల్ భవనం నిర్మించారు. ఇది కేవలం 18,720 మంది ఫాక్స్ కాన్ మహిళా ఉద్యోగుల కోసమే నిర్మించారు.
అయితే, ఫాక్స్ కాన్ తమ సంస్థలో వివాహితులైన మహిళల నియామకాన్ని వ్యవస్థీకృతంగా మినహాయిస్తున్నదని రాయిటర్స్ గత జూన్ నెలలో వార్తా కథనం ప్రచురించింది. అవివాహితల కంటే వివాహిత మహిళలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్న కోణంలో వారికి ఉద్యోగాలు నిరాకరిస్తున్నదని ఆ వార్తా కథనం సారాంశం. అయితే 2022లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని ఫాక్స్ కాన్ అంగీకరించింది. ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.