Market Capitalisation | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 స్క్రిప్ట్‌ల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.82,480.67 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ భారీగా లబ్ధి పొందాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ఇతర సంస్థలు కూడా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 360.59 పాయింట్లు (0.59 %) లాభ పడింది. మార్కెట్ లీడర్ రిలయన్స్తోపాటు టీసీఎస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ వంటి స్క్రిప్ట్‌లు కూడా భారీగా నష్టపోయాయి.
టాప్-10 స్క్రిప్టుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,432.65 కోట్లు వృద్ధి చెంది రూ. 9,26,187.54 కోట్లకు దూసుకెళ్లింది. టాప్-10లో కొత్తగా చోటు దక్కించుకున్న అదానీ టోటల్ గ్యాస్ ఎం-క్యాప్ రూ.22,667.1 కోట్లు పెరిగి రూ.4,30,933.09 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,144.18 కోట్లు లబ్ధి పొంది రూ.4,96,067.07 కోట్ల వద్ద స్థిర పడింది. ఇక ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,236.74 కోట్లు లాభపడి రూ.6,41,921.69 కోట్ల వద్ద నిలిచింది.
ఇక ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,246 కోట్లు నష్టపోయి రూ.5,98,758.09 కోట్ల వద్ద స్థిర పడింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.16,676.24 కోట్లు పతనమై రూ.16,52,604.31 కోట్లతో సరిపెట్టుకున్నది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ. 8,918.25 కోట్లు తగ్గి రూ.Rs 4,41,864.34 కోట్లకు పరిమితమైంది.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,095.07 కోట్లు హరించుకుపోవడంతో దాని ఎం-క్యాప్ రూ. 5,28,426.26 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.4,592.11 కోట్లు కోల్పోయి రూ.12,30,045 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,960.45 కోట్లు నష్టపోయి రూ.6,07,345.37 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత అత్యంత విలువ గల సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ, అదానీ టోటల్ గ్యాస్ నిలిచాయి.