న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఖజానా కాసుల గలగలలాడుతున్నది. గత కొన్నేండ్లుగా సార్వత్రిక బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలకు చేరుకోలేకపోతున్న సర్కార్..ఈసారి మాత్రం తన పంథాను మార్చుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి పీఎస్‌యూల్లో వాటాల విక్రయాన్ని స్పీడ్ పెంచింది. గడిచిన ఐదు నెలల్లోనే ఏకంగా పది సంస్థల వాటాలను విక్రయించింది.
2026-27లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తొమ్మిది సంస్థల్లో వాటాలను తగ్గించుకోవడంతో రూ.50 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించింది. ప్రస్తుత సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో రూ.80 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్..దీంట్లో సగం కంటే ఎక్కువగా నిధులు సమీకరించినట్లు అయింది. ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జీఐసీ, ఐఆర్ఎఫ్సీ, ఎల్ఐసీల్లో వాటాలను అమ్మేయడంతో రూ.52,716 కోట్ల నిధులు సమకూరాయి. వీటిలో ఎనిమిది సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో వాటాలను విక్రయించిన కేంద్ర సర్కార్..మరో ఎస్‌యూయూటీఐ సంస్థలో రెమిటెన్స్ ద్వారా నిధుల సమకూరాయి.
హిందుస్థాన్ కాపర్లోనూ..
హిందుస్థాన్ కాపర్‌లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా వాటాను విక్రయించడంతో కేంద్రానికి రూ.3 వేల కోట్ల వరకు నిధులు జమకూరాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన విశేష స్పందన రావడంతో వల్లనే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించినట్టు దీపం కార్యదర్శి అరునీష్ చావ్లా తెలిపారు. ఓఎఫ్ఎస్ రూట్లో ఆరు శాతానికి సమానమైన 5.8 కోట్ల షేర్లను విక్రయించింది. షేరును రూ.514 చొప్పున రెండు రోజుల పాటు జరిగిన ఓఎఫ్ఎస్ చివరి రోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో కేంద్ర ప్రభుత్వం 66.14 శాతం వాటా కలిగివున్నది. ఇప్పటి వరకు ఆరు పీఎస్యూఈల్లో ఓఎఫ్ఎస్ ద్వారా రూ.18 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించింది. దీంతోపాటు ఆస్తుల నగదీకరణను స్పీడ్ పెంచింది.
మోదీ హయాంలో పీఎస్‌యూల్లో వాటాల ఉపసంహరణలు
ఆర్థిక సంవత్సరం : సమీకరణ (రూ.కోట్లలో)
2014-15 : 24,349
2015-16 : 24,058
2016-17 : 46,378
2017-18 : 1,00,642
2018-19 : 87,513
2019-20 : 50,300
2020-21 : 32,886
2021-22 : 13,534
2022-23 : 35,294
2023-24 : 12,504
2024-25 : 7,810
2025-26 : 26,554