AirIndia | మహారాజ.. ఎయిరిండియాకు పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో టాటా సన్స్ వడివడిగా పావులు కదుపుతున్నది. సిబ్బందికి క్రమశిక్షణతోపాటు హుందాతనంతో వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసిన టాటా సన్స్.. తాజాగా ఎయిరిండియాకు నూతన సీఈవో కం ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్)ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐకీ (Ilker Ayci)ని ఎయిరిండియా ఎండీ కం సీఈవోగా ఎంపిక చేసినట్లు సమాచారం. సోమవారం జరిగే ఎయిరిండియా బోర్డు సమావేశంలో నూతన సీఈవోను ఖరారు చేయనున్నట్లు వినికిడి. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ హాజరవుతారు. ఇల్కర్ ఐకీ వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీన ఎయిరిండియా సీఈవో కం ఎండీగా బాధ్యతలు చేపడతారు.
విమానయాన పరిశ్రమ లీడర్ ఇల్కర్. టర్కిష్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా దాని సక్సెస్‌కు కారణం అయ్యారు. టాటా గ్రూప్‌లోకి రావాలని ఇల్కర్కు స్వాగతం పలుకుతున్నందుకు సంతోషిస్తున్నా. ఎయిరిండియాకు సారధ్యం వహించి కొత్త అధ్యాయం లిఖించాలని అభ్యర్థిస్తున్నా అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు.
ఎయిరిండియా సీఈవోగా ఎంపికైన ఇల్కర్ ఐకీ మాట్లాడుతూ ఐకానిక్ ఎయిర్‌లైన్స్‌కు సారధ్యం వహించేందుకు వచ్చిన అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. టాటా గ్రూప్‌లో చేరుతున్నందుకు సంతోషిస్తున్నా అని చెప్పారు. ఎయిరిండియాలో తన కొలీగ్స్, టాటా గ్రూప్ నాయకత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నానన్నారు. ఎయిరిండియాను ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఎయిర్‌లైన్స్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారు. అయితే, ఇల్కర్ ఐసీ నియామకాన్ని దేశీయ రెగ్యులేటరీ సంస్థలు ఆమోదించాల్సి ఉంది.