GDP | న్యూఢిల్లీ, మార్చి 15: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీడీపీ గణాంకాలు ఒక మిస్టరీగా ఉన్నాయని మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ అభివర్ణించారు. 2023 క్యాలండర్ సంవత్సరం చివరి మూడు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ విశ్లేషకుల అంచనాల్ని మించి 8.4 శాతం వృద్ధిచెందినట్టు ఇటీవల గణాంకాలు వెలువడ్డాయి. ఈ అంకె మూడున్నర ఏండ్ల గరిష్ఠస్థాయి. అలాగే తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతం నుంచి 8.2 శాతానికి, ద్వితీయ త్రైమాసికం వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 8.1 శాతానికి పెంచుతూ జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) సవరించింది. ఈ డాటాపై సుబ్రమణియన్ ఒక సదస్సులో మాట్లాడుతూ ‘తాజా జీడీపీ అంకెలపై అభిప్రాయాన్ని నేను నిజాయితీగా మీకు తెలియచేస్తున్నా, వాటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నా. అవి పూర్తిగా మాయాస్పదమైనవి. అవి ఏమిటో తెలియడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
‘ప్రైవేటు వినియోగం 3 శాతమే ఉన్నా, ఆర్థిక వ్యవస్థ ఏడున్నర శాతం వృద్ధిచెందడం దిగ్భ్రాంతి కలిగించే అంశమని అన్నారు. తాజా డాటాలో జరిగిన తప్పుల్ని తొలగిస్తే, 2024 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన వృద్ధి అంచనా 7.6 శాతానికి బదులు వాస్తవ వృద్ధి రేటు 4.3 శాతం ఉంటుందని సుబ్రమణియన్ విశ్లేషించారు. పెట్టుబడులకు భారత ఆర్థిక వ్యవస్థ చాలా మంచి కేంద్రం అన్న బజ్ ఉన్నప్పటికీ, గత కొద్ది త్రైమాసికాలుగా, కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడులు తీవ్రంగా తగ్గుతున్నాయని మాజీ సిఈఏ వివరిస్తూ ‘మీరు చూస్తే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వాస్తవానికి పడిపోయాయి’ అని చెప్పారు. ‘భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రదేశం అయితే, ఎందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం లేదు’ అని ప్రశ్నించారు. ప్రైవేటు పెట్టుబడులు, కార్పొరేట్ పెట్టుబడులు 2016 స్థాయికంటే దిగువనే ఉన్నాయన్నారు.
ఒక ప్రశ్నకు సీఈఏ స్పందిస్తూ ఇండియా పెద్ద మార్కెట్ అనే అపోహ నుంచి భారతీయులు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకుపైబడి ఉండగా, మధ్యతరగతి వర్గాల మార్కెట్ 750 బిలియన్ డాలర్లు మాత్రమేనని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 20-30 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని, దీంతో మనం పోల్చుకోవచ్చన్నారు. ‘దేశీయ మార్కెట్ ఆధారంగా మనం వృద్ధిచెందవచ్చని ఆలోచించడం పొరపాటు. మన జడ్జిమెంట్లో అది పెద్ద తప్పు’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తయారీ ఉత్పత్తుల వృద్ధి రేటు 15 శాతం లేకుండా, 7-8 శాతం వృద్ధిని ఏ దేశం సాధించలేదని వివరించారు.