ముంబై, అక్టోబర్ 28: దేశంలో ఫారెక్స్ నిల్వలు అంతకంతకూ పడిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రెండేండ్ల కనిష్టానికి క్షీణించినట్టు తేలింది. ఈ నెల 21తో ముగిసిన వారంలో మరో 3.847 బిలియన్ డాలర్లు దిగజారి 524.52 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. జూలై 2020 తర్వాత ఈ స్థాయికి దేశంలో డాలర్ రిజర్వులు పతనం కావడం ఇదే తొలిసారి. కాగా, అంతకుముందు వారం కూడా నిల్వలు 4.5 బిలియన్ డాలర్లు ఆవిరైపోవడం గమనార్హం.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓవైపు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు విఫలమవుతుండగా.. మరోవైపు డాలర్ నిల్వలు క్రమేణా దిగజారిపోతున్నాయి. దీంతో రూపాయి బలోపేతానికి ఫారెక్స్ నిల్వల్ని బలిపెట్టవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వేళ.. డాలర్ నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలనీ హితవు పలుకుతున్నారు.