Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు తగ్గాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది. 2024 డిసెంబర్ 27వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు నష్టపోయి 640.279 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందు డిసెంబర్ 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 8.478 బిలియన్ డాలర్లు పతనమై 644.391 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత కొన్ని వారాలుగా భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పతనం అవుతున్నాయి. యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో జోక్యం చేసుకుని డాలర్లు విక్రయిస్తున్నది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి భారత్ పారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లతో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి.
ఈ నెల 27తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 4.641 బిలియన్ డాలర్లకు పతనమై 551.921 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం రిజర్వ్ నిల్వలు 541 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 66.268 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 12 మిలియన్ డాలర్లు తగ్గి, 17.873 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు 4.217 బిలియన్ డాలర్లు యధాతథంగా కొనసాగాయి.