న్యూఢిల్లీ, అక్టోబర్ 21: రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్‌బ్యాంక్ ఖర్చుచేస్తున్న డాలర్లతో భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వేగంగా హరించుకుపోతున్నాయి.అక్టోబర్ 14తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 27 నెలల కనిష్ఠస్థాయి 528.7 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. 2020 జూలై తర్వాత విదేశీ మారకం ఈ స్థాయికి దిగజారడం ఇదే ప్రథమం. కేవలం ఒకే వారంలో 4.50 బిలియన్ డాలర్లు తరిగిపోయాయి.
నిరుడు సెప్టెంబర్ 3న 642.45 బిలియన్ డాలర్లున్న ఈ రిజర్వుల నుంచి ఇప్పటికే 114.08 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం విదేశీ మారక నిల్వల్లో అత్యధికంగా విదేశీ కరెన్సీ ఆస్తులు 2.83 బిలియన్ డాలర్ల తగ్గుదలతో 468.67 బిలియన్ డాలర్లకు తగ్గాయి. బంగారం నిల్వలు 1.50 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 37.45 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
ప్రస్తుతం భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు కేవలం 9 నెలలలోపే దిగుమతులకే సరిపోతాయి. ఈ నిల్వలు 390 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గిపోతే దేశం 6 నెలలే దిగుమతుల్ని చేసుకోగలుగుతుంది.