Shashank Goyal | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు కీలకపాత్ర పోషిస్తాయని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసీఆర్హెచ్ఆర్డీ) కేంద్రం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ చెప్పారు. విదేశీ వాణిజ్యం కేవలం జీడీపీని మాత్రమే కాదు.. ఉద్యోగావకాశాలు, వేతనాలను కూడా పెంచుతుందని పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఐటెక్ విభాగం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈజిప్ట్ వాణిజ్య దౌత్యవేత్తల శిక్షణా కోర్సు శుక్రవారం ముగిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోయల్ మాట్లాడుతూ.. ఈజిప్ట్, భారత్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మకంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఈజిప్ట్ వాణిజ్య దౌత్యవేత్తలకు, వారి దేశాభివృద్ధికి దోహదపడేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అందిస్తాయని చెప్పారు. అనంతరం ఈజిప్ట్ వాణిజ్య దౌత్యవేత్తలకు కోర్సు పూర్తి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ డాక్టర్ మాధవి రవులపాటి, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.