Foreign Exchange Reserves | ముంబై, నవంబర్ 22: విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను మారకం నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు తరిగిపోయి 657.892 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితంవారంలోనూ నిల్వలు 6.477 బిలియన్ డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 15.548 బిలియన్ డాలర్లు తరిగిపోయి 569.835 బిలియన్ డాలర్లకు పడిపోవడం వల్లనే విదేశీ నిల్వ లు తగ్గాయని తన నివేదికలో వెల్లడించింది.
అలాగే గోల్డ్ రిజర్వులు కూడా 2.068 బిలియన్ డాలర్లు తగ్గి 65.746 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూ డా 51 మిలియన్ డాలర్లు తగ్గి 4.247 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది.