న్యూఢిల్లీ, జూన్ 2: వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన్ డాలర్ల వరకూ తగ్గాయి. సమీక్షా వారంలో4.339 బిలియన్ డాలర్ల మేర తగ్గి, 589.138 బిలియన్ డాలర్ల వద్దకు చేరినట్టు శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. రెండు వారాల క్రితం ఇవి 600 బిలియన్ మార్క్ సమీపానికి చేరిన తర్వాత అనూహ్యంగా పడిపోయాయి.
విదేశీ మారక నిల్వల్లో అధికభాగమైన కరెన్సీ ఆస్తులు మే 26తో ముగిసిన వారంలో 4.014 బిలియన్ డాలర్ల మేర తగ్గి, 520.931 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. నాన్-అమెరికా కరెన్సీలు యూరో, పౌండ్, యెన్ విలువల తగ్గుదల లేదా పెరుగుదలతో కూడా కరెన్సీ ఆస్తుల నిల్వల్లో మార్పు ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 225 మిలియన్ డాలర్ల వరకూ తగ్గి 44.902 డాలర్ల వద్దకు పడిపోయాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 84మిలియన్ల మేర తగ్గడంతో ఈ నిల్వలు 18.192 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్దనున్న భారత్ నిల్వలు 17 మిలియన్ల తగ్గుదలతో 5.113 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి.
2021 అక్టోబర్‌లో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరుకున్న తర్వాత క్రమేపీ తగ్గుతూ ఒక దశలో 500 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయాయి. అటుతర్వాత కొంతమేర పుంజుకున్నా, తాజా నిల్వలు రికార్డుస్థాయికి 55 బిలియన్ల దూరంలో నిలిచిఉన్నాయి. రూపాయి నిలువునా పతనమైన నేపథ్యంలో క్షీణతను నిలువరించడానికి రిజర్వ్‌బ్యాంక్ అమెరికా డాలర్లను ఖర్చుచేయడం, చమురు ధరలు భారీగా పెరగడంతో దిగుమతులకు విదేశీ కరెన్సీని వ్యయపర్చాల్సిరావడంతో గత ఏడాది మారక నిల్వలు ఆవిరైపోయాయి. దాదాపు రెండేండ్లు గడుస్తున్నా, మళ్లీ అప్పటి రికార్డుస్థాయికి చేరుకోలేకపోతున్నాయి.