Ford Motors | భారత్‌లోని ఫ్యాక్టరీలను మూసేస్తున్నట్లు గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్. దీని ప్రభావం 4,000 మంది ఉద్యోగుల జీవితాలపై పడింది. గుజరాత్‌లోని సనంద్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను టాటా మోటార్స్ టేకోవర్ చేసుకుంది. కానీ తమిళనాడులోని మరాయి మలాయి నగర్లో యూనిట్ భవితవ్యంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నది. మెరుగైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్న మరాయిమలాయి నగర్ యూనిట్ కార్మికులకు ఫోర్డ్ మోటార్స్ కంపెనీ చివరి ఆల్టిమేటం జారీ చేసింది.
నాన్ నెగోషియబుల్ సివరెన్స్ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నట్లు ఫోర్డ్ మోటార్స్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను ఆమోదించడానికి సోమవారం సాయంత్రం వరకు గడువు పెట్టింది. జూన్ 14 తర్వాత తమ ఆఫర్ ఆమోదించని కార్మికులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తుగా యూనిట్ మూసివేత ప్రకటించింది. విదేశాలకు కార్ల ఎగుమతి ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందు ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి ఫోర్డ్ సిద్ధమైంది.
ఉద్యోగుల సర్వీసును బట్టి ఏడాదికి 115 స్థూల వేతనం చొప్పున పరిహారం ఇవ్వనున్నది. ఇది చట్టబద్ధమైన ప్యాకేజీ కంటే 15 రోజుల వేతనం ఎక్కువ ఇస్తున్నామని ఫోర్డ్ తెలిపింది. గత నెలాఖరు నాటికి 87 రోజులు తీసుకున్న స్థూల వేతనానికి సమానమైన ఎక్స్‌గ్రేషియా, రూ.50 వేల ఫిక్స్డ్ నగదు ఒక్కో కార్మికుడికి అంద చేయనున్నాయి. 2024 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగింపు, రూ.2.40 లక్షల విలువైన భారీ నగదు మొత్తం కూడా అందజేయనున్నది.
తమిళనాడులోని ఫోర్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో పని చేస్తున్న సుమారు 2000 మంది కార్మికులు మెరుగైన పరిహార ప్యాకేజీ కోసం 15 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కానీ, సోమవారం సాయంత్రంలోగా తమ ప్యాకేజీని ఆమోదించేవారు సమాచారం ఇవ్వాలని యాజమాన్యం నోటీసు జారీ చేసింది. మంగళవారం నుంచి కార్ల తయారీ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది.