Limits on Cash Payments | అనధికార, అక్రమ నగదు లావాదేవీలను అరికట్టి, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నడుం బిగించింది. అందులో భాగంగా నగదు లావాదేవీలపై ( Cash Transactions ) ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. నగదు లావాదేవీలు పరిమితి దాటితే మాత్రం ఆర్బీఐ భారీ జరిమానా విధిస్తుంది. ఒక్కోసారి మీరు జరిపిన లావాదేవీ మొత్తం పెనాల్టీ కింద చెల్లించాల్సి రావొచ్చునని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ – CBDT ) రూపొందించిన నిబంధనలు చెబుతున్నాయి.
సీబీడీటీ తాజాగా ఖరారు చేసిన నిబంధన ప్రకారం ఏటా రూ.20 లక్షలకు పైగా డిపాజిట్ చేసేవారు పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఒక రోజుకు రూ.50 వేలు జమ చేసేవారు పాన్ కార్డు తప్పనిసరి చేసింది ఆర్బీఐ. కానీ అప్పట్లో ఏడాది పరిమితులేమీ లేవు.
ప్రస్తుత భారత ఆదాయం పన్ను చట్టం ప్రకారం లావాదేవీల విలువ రూ.2 లక్షలు దాటితే.. క్యాష్ చెల్లింపులకు అనుమతుల్లేవు. రూ.2 లక్షల పైనా.. అంటే రూ.2 లక్షలకంటే ఒక్క రూపాయి ఎక్కువ లావాదేవీ జరిపినా ఖచ్చితంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, చెక్, బ్యాంక్ నుంచి మాత్రమే జరుపాలి. రూ.2 లక్షల్లోపు మాత్రమే నగదు లావాదేవీ జరుపొచ్చన్న నిబంధన 2017లో అమల్లోకి వచ్చింది.
ఒకవేళ మీరు. మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ సమీప బంధువులతో లావాదేవీలు జరిపినా ఈ నిబంధన పాటించడం తప్పనిసరి. నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ఆదాయం పన్ను చట్టంలోని 269 ఎస్టీ సెక్షన్ కింద రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలను జరుపడాన్ని నిషేధించింది. చివరకు బహుమతుల స్వీకరణకు కూడా ఈ నిబంధన అమలవుతుంది. రూ.2 లక్షలకంటే ఎక్కువ విలువ గల నగదు బహుమతి అందుకోవచ్చు. అంతకు మించిన నగదు బహుమతి అందుకుంటే నిబంధన ఉల్లంఘనే అవుతుంది. గిఫ్ట్ విలువతో సమాన మొత్తం ఫైన్ విధించొచ్చు.
చెక్ లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే హెల్త్ బీమా ప్రీమియం చెల్లించాలి. క్యాష్ రూపంలో చెల్లిస్తే ఆదాయం పన్ను చట్టంలోని 80డీ సెక్షన్ కింద మినహాయింపు లభించదు. ఎవరి నుంచైనా.. ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకున్నా రూ.20 వేల వరకు నగదు రూపంలో పొందొచ్చు. రూ.20 వేలు దాటితే ఆన్లైన్ లావాదేవీలే జరుపాలి. ఆస్తుల లావాదేవీలకు, అడ్వాన్స్ చెల్లింపులు చేసినా లేదా పొందినా ఇదే పరిమితి వర్తిస్తుంది.