ముంబై, ఫిబ్రవరి 22: ప్రపంచ మార్కెట్లో డాలరు బలహీనపడిన నేపథ్యంలో రూపాయి మారకపు విలువ ఐదు నెలల గరిష్ఠస్థాయికి చేరింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో 82.94 వద్ద ప్రారంభమైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 11 పైసలు లాభపడి 82.85 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల గరిష్ఠస్థాయి. నిరుడు సెప్టెంబర్ 4 తర్వాత ఈ స్థాయిలో దేశీ కరెన్సీ ముగియడం ఇదే ప్రధమం.
యూఎస్ డాలర్ బలహీనత, దేశీయ స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నెలకొనడం రూపాయి ర్యాలీకి కారణమని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్ అయిన డాలర్ ఇండెక్స్ 0.31 శాతం తగ్గి 103.68 వద్ద ట్రేడవుతున్నది. బీఎస్ఈ సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 73,158 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 79 డాలర్ల స్థాయిని దాటింది.