Sanjay Malhotra | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం చెందడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. మారకం విలువ రోజువారీగా పతనం చెందడంపై సెంట్రల్ బ్యాంక్ పెద్దగా ఆందోళన చెందబోదని, దీర్ఘకాలిక విలువ మార్పుపైనే దృష్టి సారించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో ఈ విషయాన్ని చెప్పారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.50కి పడిపోయిన విషయం తెలిసిందే. రూపాయి విషయంలో ఆర్బీఐ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు..విలువ స్థాయిని గానీ, ఒక బ్యాండ్‌ను గానీ మేం చూడబోం ..ఎప్పుడైన భారీ స్థాయిలో ఒడిదుడుకులు ఎదురైతే జోక్యం చేసుకుంటామని చెప్పారు. రోజువారీ విలువ తగ్గడం, పెరగడం సర్వ సాధారణంగా జరుగుతుంటాయి..వీటిని పెద్దగా పట్టించుకోబోమని ఆయన స్పష్టంచేశారు. కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే దేశీయ ద్రవ్యోల్బణం 30-35 బేసిస్ పాయింట్లు మేర ప్రభావం చూపనున్నదని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలను రూపీ-డాలర్ విలువ ఆధారంగానే లెక్కకట్టినట్లు చెప్పారు.
అంతర్జాతీయ పరిణామాల వల్లనే
అంతర్జాతీయ పరిణామాల వల్లనే కరెన్సీ పడిపోతున్నది తప్ప దేశీయ పరిస్థితుల కారణంగా రూపాయి పతనం చెందడం లేదని మల్హోత్రా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాల విధిస్తుండటం ఇందుకు ప్రధాన కారణమన్నారు. త్వరలో దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతున్న రూపాయి విలువ శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ఐదేండ్ల తర్వాత రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడంతో రూపీ విలువ 9 పైసలు పెరిగి 87.50 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్ వ్యవస్థలో నిధుల లభ్యతపై వస్తున్న ఆందోళనపై ఆయన స్పందిస్తూ..బ్యాంకింగ్ వ్యవస్థలో నిధులను పెంచడానికి తమ వద్ద ఎన్నో అస్ర్తాలువున్నాయని, అవసరమైనప్పుడు వాటిని వినియోగిస్తామని చెప్పారు. క్రిప్టో కరెన్సీపై ఆయన స్పందిస్తూ..ప్రస్తుతం ఈ అదృశ్య కరెన్సీపై ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు సంబంధించి త్వరలో ఒక గ్రూపును ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నదన్నారు. ఈ సమావేశానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు రాజేశ్వర్ రావు, రవి శంకర్, స్వామినాథన్‌తోపాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు కూడా పాల్గొన్నారు.
వచ్చేవారంలో ఐటీ బిల్లు: సీతారామన్
వచ్చేవారంలో పార్లమెంట్ సమావేశాల్లోనే నూతన ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. ఆరు దశాబ్దాల క్రితం రూపొందించిన ఐటీ బిల్లు స్థానంలో నూతన బిల్లును ప్రవేశపెట్టడానికి ఇప్పటికే కసరత్తు పూర్తైందని మంత్రి చెప్పారు. లోకసభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించడం జరుగుతున్నదని, ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించిందన్నారు.