Flipkart-Bill Desk | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారాన్ని ఇతర విభాగాల్లోకి విస్తరిస్తోంది. ఫాస్టాగ్, డీటీహెచ్ రీచార్జీతోపాటు ఐదు కొత్త సెగ్మెంట్లలో డిజిటల్ పేమెంట్స్ సేవల సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ‘బిల్ డెస్క్’తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లింపునకూ ఈ సౌకర్యం విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. బిల్ డెస్క్- ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్య ఒప్పందంతో కొత్త పేమెంట్స్ సేవలను భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్‌తో లింక్ చేయడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం విద్యుత్ బిల్లుల పేమెంట్స్, మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జీ సేవలను ఫ్లిప్ కార్ట్ అందిస్తున్నది. ‘కస్టమర్లు తేలిగ్గా డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు వైవిధ్య భరితమైన సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ పేమెంట్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా తెలిపారు.