ముంబై, జనవరి 10: ఈఎంఐ (నెలవారీ వాయిదా సమాన చెల్లింపులు) ఆధారిత వ్యక్తిగత రుణాల్లో ఫిక్స్డ్ వడ్డీరేటు ప్రోడక్ట్‌ను కూడా కస్టమర్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని శుక్రవారం బ్యాంకులకు, తమ పరిధిలోని ఇతర ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. రుణాల మంజూరు సమయంలో వర్తించే వార్షిక వడ్డీరేటు, వార్షిక పర్సంటేజ్ రేట్ల సమాచారం రుణగ్రహీతలకు తెలియపర్చాలని, రుణ ఒప్పందంలో పేర్కొనాలని కూడా స్పష్టం చేసింది. అప్పు తీసుకున్న తర్వాత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ లేదా టెన్యూర్‌లో ఏదైనా పెరుగుదల ఉన్నా ఆ సమాచారాన్ని రుణగ్రహీతకు చెప్పాలన్నది. అసలు, వడ్డీ బకాయిలు, మిగిలిన ఈఎంఐల వివరాలనూ మూడు నెలలకోసారి అందజేయాలని ఆర్బీఐ రుణదాతలకు సూచించింది.