Pawan Munjal-Hero Moto Corp | దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ ఖాతాల్లో రూ.5.96 కోట్ల లావాదేవీలపై తప్పుడు లెక్కలు రాసినందుకు, మోసపూరితంగా వ్యవహరించినందుకు, పొర్జరీ చేసినందుకు పవన్ ముంజాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సంస్థ తరఫున ఫేక్ బిల్లులు సృష్టించి రూ.55.5 లక్షల టాక్స్ క్రెడిట్ పొందారని పవన్ ముంజాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.
‘పవన్ ముంజాల్.. 2000-2010 మధ్య నెలవారీగా రూ.5,94,52,525 విలువైన ఫేక్ బిల్లులు తయారు చేశారు. ఈ బిల్లుల పేరుతో ఇంతే మొత్తం నగదు బ్యాంకు ఖాతాల నుంచి విత్ డ్రా చేశారు. తద్వారా ఫేక్ బిల్లులతో రూ.55,51,777 ‘ఫేక్ టాక్స్ క్రెడిట్’ దాఖలు చేసి ఆదాయం పన్ను విభాగాన్ని మోసగించారు` అని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఈ వార్తలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో హీరో మోటో కార్ప్ షేర్లు మూడు శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు గత ఆగస్టులో పవన్ ముంజాల్ ఇల్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేసింది. 2018లో లండన్‌లో పవన్ ముంజాల్ వ్యాపార పర్యటన కోసం థర్డ్ పార్టీ సేవల సంస్థ అధికారిని నియమించుకున్నది హీరో మోటో కార్ప్. ముంజాల్, ఆ థర్డ్ పార్టీ సంస్థ అధికారి లండన్ బయలుదేరి వెళుతుండగా, సదరు అధికారి బ్యాగ్‌లో రూ.81 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ ఉందని కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. ఈ కరెన్సీని కస్టమ్స్ అధికారులు జప్తు చేసి, కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ తనిఖీలు చేసింది. పన్ను ఎగవేత కేసులో గతేడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇల్లు, ఆఫీసుల్లో ఆదాయం పన్ను అధికారులు తనిఖీలు జరిపారు.