న్యూఢిల్లీ, జనవరి 31: కొత్త పద్దుకు వేళైంది. ఎప్పట్లాగే వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు ఈసారి బడ్జెట్‌పైనా గంపెడాశలు పెట్టుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు పన్ను విధానాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా? అని వేచిచూస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించడం ఇదే తొలిసారి. కాగా, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డగోలు సుంకాలు, జాబ్ మార్కెట్లో సంక్షోభాలు, స్టాక్-కమోడిటీ మార్కెట్ల ఒడిదుడుకుల నడుమ ఆషామాషీ బడ్జెట్‌తో ఒరిగేదేమీ ఉండబోదని ఆర్థిక విశ్లేషకులైతే అంటున్నారు.
ఇదీ సంగతి..
ఈసారి బడ్జెట్లో స్థిరమైన వృద్ధి, ఉద్యోగాల కల్పన, తయారీ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలుండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పారిశ్రామిక రంగం డిమాండ్లనూ పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే.. సంస్కరణలకు నడుం బిగించాలని సలహా ఇస్తున్నారు. నిజానికి దేశీయ మార్కెట్లో వినియోగదారుల కొనుగోలు శక్తి క్రమేణా క్షీణిస్తున్నది. దాన్ని బలపర్చే విషయంలో ఇప్పటికే మోదీ సర్కార్ తీవ్ర ఒత్తిళ్లనే ఎదుర్కొంటున్నదని పలువురు ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్‌ను ఉద్యోగ కల్పన, పెట్టుబడుల పెంపునకు సదవకాశంగా భావించి చర్యలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా భారత్‌పై విదేశీ మదుపరులలో సన్నగిల్లిన విశ్వాసాన్ని పెంపొందించడం.. ఆర్థిక మంత్రి ఎదుట ఇప్పటికిప్పుడున్న అసలు పరీక్షగా వారు పేర్కొంటుండటం గమనార్హం. భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగుతున్నారని, ఈ పరిణామం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువనూ గట్టిగానే ప్రభావితం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు.
ఐటీ స్లాబులను సవరించాలి..
ఆదాయ పన్ను (ఐటీ)కు సంబంధించి కొత్త, పాత విధానాలను అవలంబిస్తున్న కేంద్రం.. పొదుపునకు పెద్దపీట వేసే పాత విధానాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే గత కొన్నేండ్లుగా ఏటా కొత్త బడ్జెట్లోనే మార్పులు చేస్తున్నది. గత బడ్జెట్లో ఐటీ స్లాబులను సవరించినదీ తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం, జాబ్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో నూతన ఐటీ విధానంలో గరిష్ఠ స్లాబును సడలించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.24 లక్షలు దాటితే 30 శాతం పన్ను వర్తిస్తున్నది. దీంతో ఈ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ల పరిమితుల్నీ పెంచాలంటున్నారు. అలాగే టీడీఎస్‌కు సంబంధించి కూడా ఊరటనివ్వాలని పన్ను చెల్లింపుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డిజిటలైజేషన్‌కు చేయూత కావాలి
కృత్రిమ మేధస్సు (ఏఐ), నూతన ఆవిష్కరణలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఈసారి బడ్జెట్లో తగినంత ప్రోత్సాహకాలు ఇవ్వాలని టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో ఏఐకి గొప్ప భవిష్యత్తు ఉన్నదని, ఇక్కడి యువత దాన్ని అందిపుచ్చుకుంటే విస్తృత ప్రయోజనాలను చూడవచ్చంటూ టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ అన్నారు. అలాగే చిప్ తయారీదారులు, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ వర్గాలు కూడా బడ్జెట్ తమకు వెన్నుదన్నుగా నిలువాలని కోరుకుంటున్నారు.
పన్నుల్లో తేడాలు వద్దు: ఎస్బీఐ చీఫ్
బ్యాంక్ డిపాజిట్లు, ఈక్విటీ పెటు్టబడుల ద్వారా వచ్చే రాబడులపై విధిస్తున్న పన్నుల్లో వ్యత్యాసం ఉంటున్నదని.. ఇది సరికాదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. శనివారం ముంబైలో ఓ బ్యాంకింగ్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా పన్నుల్లో ఈ రకమైన తేడాలు లేవని గుర్తుచేశారు. భారత్‌లో కూడా అదే తీరున ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం డిపాజిట్లపై అందుకున్న రాబడులకు వ్యక్తిగత ఆదాయ పన్ను గరిష్ఠ స్లాబు 30 శాతం వరకు వర్తిస్తున్నదని చెప్పారు. కానీ లిస్టెడ్ ఈక్విటీలపై పొందే రాబడులకు తక్కువ లేదా రాయితీలతో కూడిన పన్నులున్నాయని, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా 12.5 శాతం, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా 15-20 శాతం ఉందని వివరించారు.
నిజానికి ఈ రెండు పెట్టుబడి సాధనాలపై పొందుతున్న రాబడులపట్ల అనుసరిస్తున్న ఈ పక్షపాత పన్ను విధానాన్ని బ్యాంకులు ఎప్పట్నుంచో ప్రశ్నిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. అయినప్పటికీ లాభం లేకపోతున్నదని ఒకింత అసహనాన్ని వెలిబుచ్చారు. ఈ పన్ను తేడాల వల్ల చాలామంది బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలనే ఉంచి, మిగతా మొత్తాలను ఈక్విటీల వైపునకు మళ్లిస్తున్నారని చెప్పారు. ఫలితంగా బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఆవేదన చెందారు. ఇదిలావుంటే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలకు ఊతమిచ్చేలా అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ (ఐఎఫ్ఎస్సీ)కు సంబంధించి అమలుచేస్తున్న ట్యాక్స్ హాలిడేను పొడిగిస్తే బాగుంటుందని కూడా శెట్టి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.