Elon Musk : ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ సీఈవో (SpaceX CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) భారత్కు సంబంధించి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. భారత్ (India) లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన ప్రతిస్థాపన స్థాయి (Replacement Level) కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మీడియా సంస్థ ‘ఏఎఫ్ పోస్ట్’ షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. భారత్లో జననాల రేటు ప్రతిస్థాపన స్థాయి కంటే తగ్గిందని, ముఖ్యంగా బాగా చదువుకున్న వారిలో ఈ రేటు చాలా ఏళ్ల క్రితమే పడిపోయిందని తన పోస్టులో పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 పిల్లలు అనే ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ‘ఏఎఫ్ పోస్ట్’ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలోనే ఈ రేటు 2.3 నుంచి 1.9కి క్షీణించిందని తెలిపింది. ఢిల్లీలో అయితే ఈ రేటు 1.2 కి పడిపోయిందని, ఇది ఫిన్లాండ్ కంటే కూడా తక్కువని నివేదిక పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025’ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9 గా నమోదైందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువ అని స్పష్టం చేసింది.
సంతానోత్పత్తి రేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రతి తరం మునుపటి తరం కంటే చిన్నదిగా మారి దేశ జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని నివేదిక విశ్లేషించింది. అయితే జననాల రేటు తగ్గుతున్నప్పటికీ 146 కోట్లకు పైగా జనాభాతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతోంది. 2023లో చైనాను అధిగమించి భారత్ ఈ స్థానానికి చేరుకుంది. విద్య, పట్టణీకరణ పెరగడం, మహిళలు ఉద్యోగాల్లో చేరడం, మారుతున్న కుటుంబ ప్రాధాన్యతలు వంటివి జననాల రేటు తగ్గడానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రసూతి మరణాలు, లింగ వివక్ష వంటి సవాళ్లు ఉన్నాయని యూఎన్ఎఫ్పీఏ నివేదిక తెలిపింది.