FII Investments | వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్రం ద్వారాలు తెరుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు మొదలు వివిధ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, 2024లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు మాత్రం అస్థిరంగా ఉన్నాయి. ప్రతి నెలా వివిధ సెక్టార్లలో వాటాలు కొనుగోలు చేస్తున్న విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. ఈ ఏడాది కాలంలో ఫైనాన్సియల్, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల్లోనే రూ.లక్ష కోట్లకు పైగా వాటాలు విక్రయించారు. ప్రతి నెలా ఐదు సెషన్లలో వాటాలు విక్రయిస్తుంటే, ఏడు రెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ పీఐల పెట్టుబడులు ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.6,770 కోట్లు మాత్రమే ఉన్నాయి. జనవరి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు భారీగా ఉపసంహరించారు. అక్టోబర్ నెలలో గరిష్టంగా రూ.94,017 కోట్లు, జనవరి-మే మధ్య రూ.25 వేల కోట్లకు పైగా వాటాల్లో ఎఫ్‌పీఐ నిధులు ఉపసంహరించారు. మరోవైపు, సెప్టెంబర్‌లో అత్యధికంగా రూ.57,724 కోట్లు, మార్చిలో రూ.35,098 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్ల విలువైన వాటాలు కొనుగోలు చేశారు.
ఫైనాన్సియల్ రంగంలో అత్యధికంగా రూ.53,942 కోట్ల విలువైన వాటాలు విక్రయించారు. జనవరిలో రూ.30,013 కోట్లు, అక్టోబర్ నెలలో రూ.26,139 కోట్ల వాటాలను విక్రయించారు. నాలుగు నెలల్లో ఫైనాన్సియల్ రంగంలో పెట్టుబడులు ఉపసంహరించారు. సెప్టెంబర్ నెలలో రూ.50,851 కోట్ల విలువైన వాటాలను ఎఫ్ఐఐలు విక్రయించారు. ఈ నెల 15 నాటికి ఎఫ్ఐఐలు రూ.50,851 కోట్ల విలువైన వాటాలు ఉపసంహరిస్తే, వాటిల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లోనే అత్యధిక వాటాల విక్రయం ఉంటుంది. ఎఫ్ఎంసీజీలో రూ.19,057 కోట్లు, ఆటోమొబైల్ అండ్ ఆటో కంపోనెంట్స్ 14,148 కోట్లు, భవన నిర్మాణ రంగంలో రూ.20,163 కోట్లు, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2,244 కోట్లు, మెటల్స్ అండ్ మైనింగ్, విద్యుత్ రంగాల నుంచి ఇన్వెస్టర్లు రూ.799 కోట్ల వాటాలు ఉపసంహరించారు. మరోవైపు, క్యాపిటల్ గూడ్స్‌లో రూ.29,011 కోట్లు, కన్జూమర్ సర్వీసెస్ లో రూ.20,228 కోట్లు, హెల్త్ కేర్ లో రూ.26,506 కోట్లు, ఐటీలో రూ.12,618 కోట్లు, రియాల్టీలో రూ.20,181 కోట్లు, టెలీ కమ్యూనికేషన్స్ లో రూ.23,992 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.