Festive Offers | ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తునే ఆఫర్లను తెచ్చాయి. నవరాత్రులు, దుర్గాపూజ, దసరా, దీపావళి, భాయ్ దూజ్ పర్వదినాలుండటంతో రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), క్రెడిట్ కార్డు ఖర్చులపై వడ్డీరేట్ల సవరణ, డిస్కౌంట్లను వ్యాపారులతో కలిసి ఆయా బ్యాంకర్లు అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ఫెస్టివ్ బొనాంజా పేరిట ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్, జ్యుయెల్లరీ, ఫర్నీచర్, ట్రావెల్, ఈ-కామర్స్, డైనింగ్ కొనుగోళ్లపై రూ.40,000 వరకు ఆఫర్లు, డిస్కౌంట్లను ఇస్తున్నది. క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల వినియోగం ద్వారా పొందవచ్చు. ఐఫోన్ 16, ఇతర యాపిల్ ఉత్పత్తులపైనా ప్రత్యేక ఆఫర్లున్నాయి.
ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్ ఆధారంగా 8.35 శాతం వడ్డీకే గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నది. ప్రాసెసింగ్ ఫీజునూ రద్దు చేసింది. దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ పేరుతో యాక్సిస్ బ్యాంక్ ముందుకొచ్చింది. వివిధ రకాల బ్రాండ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పరిచయం చేసింది. ఆన్లైన్ షాపింగ్‌పై 25 శాతం వరకు డిస్కౌంట్నూ ప్రకటించింది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డు వినియోగంపై అమెజాన్ షాపింగ్‌లో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుకోవచ్చు. గృహ, వాహన, గోల్డ్ రుణాలపై ఆకర్షణీయ వడ్డీరేట్లను కెనరా బ్యాంక్ ప్రకటించింది. డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ఫీజులను ఎత్తివేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా 400 రోజుల రిటైల్ టర్మ్ డిపాజిట్‌ను పరిచయం చేసింది. గరిష్ఠ వడ్డీరేటు 8.10 శాతంగా ఉన్నది. కస్టమర్ల కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా రకరకాల ఆఫర్లను తీసుకొచ్చింది.