న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు అదిరిపోయాయి. గత నెల అక్టోబర్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, కియా తదితర కంపెనీల కార్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. పండుగ సీజన్‌తోపాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపులు కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శనివారం ఆయా సంస్థలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్ఠంగా 40 శాతం వరకు సేల్స్ పెరిగినట్టు తేలింది. ‘మొత్తంగా అక్టోబర్‌లో గణనీయంగా కార్లు అమ్ముడయ్యాయి. నిరుడు ఇదే నెలతో చూస్తే 20 శాతానికిపైగా పెరుగుదల నమోదైంది’ అని దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి, మార్కెటింగ్-సేల్స్ విభాగానికి చెందిన పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు.
అక్టోబర్‌లో ఈ స్థాయిలో రిటైల్ అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఇక నవరాత్రులతో మొదలైన 40 రోజుల పండుగ సీజన్లో 5 లక్షల బుకింగ్స్ ఉన్నాయని, 4.1 లక్షల రిటైల్ సేల్స్ జరిగాయని వెల్లడించారు. 2024తో పోల్చితే సుమారు ఇది రెట్టింపు అని పేర్కొన్నారు. అలాగే జీఎస్టీ రేట్ల తగ్గింపుతో చాలామంది కస్టమర్లు కార్లను కొనేందుకు ఆసక్తి చూపారని వివరించారు. కాగా, ఆరంభ శ్రేణిలో ఆల్టో, ఎస్-ప్రెస్సో మాడళ్లకు ఈసారి గిరాకీ తగ్గుముఖం పట్టగా.. కంపాక్ట్ కార్లలో బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, వాగనార్ మాడల్స్ విక్రయాలు పెరిగాయి. బ్రెజ్జా, ఫ్రాంగ్జ్, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటి వెహికిల్స్ విక్రయాలూ పుంజుకున్నాయి. ఈకో వ్యాన్కూ మంచి ఆదరణే లభించింది.
ఇక దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వాహన విక్రయాలు గతంతో చూస్తే 3 శాతానికిపైగా క్షీణించాయి. క్రెటా, వెన్యూ మాడళ్లకు తప్ప మిగతా వాటికి కస్టమర్ల నుంచి అంతంతమాత్రంగానే ఆదరణ లభించింది. మరోవైపు టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటానే 47,000 యూనిట్లకుపైగా ఉన్నది. మొత్తం అక్టోబర్‌లో 61,295 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్ కూడా నిరుడుతో పోల్చితే 5,355 యూనిట్ల నుంచి 9,286 యూనిట్లకు పుంజుకున్నాయి.
నవరాత్రి, దీపావళి మధ్య లక్ష వాహనాలకుపైగా టాటా మోటర్స్ డెలివరీ చేయడం గమనార్హం. గతంతో చూస్తే ఏకంగా 33 శాతం పెరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దూసుకు పోతున్న కియా ఇండియాకు ఇటీవలి కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ మాడళ్లు మరింత జోష్‌నిస్తున్నాయి. అక్టోబర్ అమ్మకా ల్లో ఈ రెండింటి వాటానే 25 శాతందాకా ఉన్నది. మొత్తానికి దసరా, ధనత్రయోదశి, దీపావళి పండుగలతోపాటు జీఎస్టీ 2.0 సంస్కరణలు భారతీయ ఆటో మార్కెట్‌కు కొత్త కళను తెచ్చిపెట్టాయనే చెప్పవచ్చు.
