Interest Rate | ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ).. రిస్క్‌కు దూరంగా, సురక్షితమైన పెట్టుబడికి చక్కని నిర్వచనం. అయితే ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే మాత్రం రాబడులు తక్కువ. కానీ కొన్ని బ్యాంకుల్లో ఎఫ్‌డీలపైనా ఆకర్షణీయ వడ్డీరేట్లున్నాయి. ఏకంగా 9 శాతానికిపైగానే వడ్డీ లభిస్తుండటం గమనార్హం. అవును.. సీనియర్ సిటిజన్లకు పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో గరిష్ఠంగా 9.50 శాతం వరకు వడ్డీరేటు వస్తున్నది.
నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
546-1,111 రోజుల (18 నెలల ఒక్కరోజు- మూడేండ్ల 16 రోజులు) కాలవ్యవధి ఎఫ్డీలపై అత్యధికంగా సీనియర్ సిటిజన్లకు 9.50 శాతం వడ్డీరేటునిస్తున్నది. రూ.5 కోట్లలోపు ఎఫ్డీలకే వర్తిస్తుంది. ఈ ఏడాది జూన్ 25 నుంచి ఈ రేటు అమల్లోకి వచ్చింది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
రెండేండ్ల నుంచి మూడేండ్లదాకా చేసే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు ఇక్కడ 9.10 శాతం వడ్డీరేటు ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4 నుంచి వర్తిస్తున్నది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సీనియర్ సిటిజన్లకు 1,001 రోజుల ఎఫ్డీపై 9.50 శాతం వడ్డీరేటు, 701 రోజుల ఎఫ్డీపై 9.25 శాతం వడ్డీరేటును ఈ బ్యాంక్ ప్రకటించింది. ఈ నెల 7 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
1,001 రోజుల ఎఫ్డీపై 9.10 శాతం, 1,500 రోజుల ఎఫ్డీపై 9.25 శాతం వడ్డీరేట్లను సీనియర్ సిటిజన్ల కోసం ఈ బ్యాంక్ ఇస్తున్నది. ఈ ఏడాది జూన్ 7 నుంచి ఈ రేట్లు అమలవుతున్నాయి.
అదనపు సౌకర్యాలు
చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అదనపు వడ్డీరేట్లను అందిస్తున్నాయి. ఫిక్స్డ్ చేసే మొత్తాల ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 0.50 శాతం నుంచి 0.75 శాతం మేర ఎక్కువ వడ్డీరేట్లు అమలవుతున్నాయి. అంతేగాక వృద్ధులకుండే సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎఫ్డీలపై రుణాలనూ బ్యాంకర్లు ఇస్తున్నారు. అయితే చేసే ఎఫ్డీలపై ఈ రుణ మొత్తాలు ఆధారపడి ఉంటాయి. పెద్ద ఎఫ్డీలపై అంతే మొత్తాల్లో రుణ సదుపాయం దొరుకుతుంది. ఈఎంఐల్లో ఈ లోన్లను తీర్చుకోవచ్చు. ఇక అత్యవసరాల దృష్ట్యా ఎఫ్‌డీల ముందస్తు ఉపసంహరణలకూ కొన్ని సంస్థలు అనుమతినిస్తున్నాయి. అయితే ఇందుకు స్వల్ప మొత్తాల్లో జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏండ్లు, ఆపై వయసుగలవారు తమ ఎఫ్డీలపై పొందే వడ్డీ ఆదాయానికి టీడీఎస్ మినహాయింపు కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ 15హెచ్‌ను సమర్పిస్తే ప్రయోజనాన్ని అందుకునే అవకాశాలున్నాయి. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 197ఏ, సబ్‌సెక్షన్ 1సీ ఇందుకు వీలు కల్పిస్తున్నది. వడ్డీరేట్లు, కాలవ్యవధి, ఇతర ప్రయోజనాలు సీనియర్ సిటిజన్లకు అత్యుత్తమ ఎఫ్డీ ఏది అనేది నిర్ణయిస్తాయి. కాబట్టి ఎఫ్డీని తీసుకొనే ముందు దాని ఫీచర్లను గమనించాలి.