SVB Collapse | దివాళా తీసిన ఎస్వీబీ (SVB)లో డిపాజిటర్ల సొమ్ముకు గ్యారంటీ కల్పించే దిశగా యూఎస్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (US FDIC) చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. గతేడాది చివరి నాటికి బ్యాంకులో 175 బిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అన్ ఇన్సూర్డ్ డిపాజిటర్లకు మనీ చెల్లించేందుకు బ్యాంకు ఆస్తుల విక్రయానికి చర్యలు చేపడుతున్నదని సమాచారం. వందశాతం డిపాజిట్లు కాపాడతామని యూఎస్ ఎఫ్డీఐసీ (US FDIC) సోమవారం శాంతాక్లారాలోని ప్రధాన కార్యాలయంతోపాటు బ్యాంకు ఇతర శాఖలు తెరుచుకోగానే ప్రకటన చేయనున్నది. బ్యాంకు కుప్పకూలిన వెంటనే.. శుక్రవారం ఎస్వీబీని యూఎస్ ఎఫ్డీఐసీ తన నియంత్రణలోకి తీసుకున్నది. అయితే, దీనిపై స్పందించడానికి యూఎస్ ఎఫ్డీఐసీ వర్గాలు నిరాకరించాయి.
మరోవైపు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) వేలం ప్రక్రియలో శనివారం అర్థరాత్రి నుంచి యూఎస్ ఎఫ్డీఐసీ నిమగ్నమైంది. ఆదివారం మధ్యాహ్నానికి బిడ్లు ఖరారవుతాయని తెలుస్తున్నది. కానీ, ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు తుది నిర్ణయం తీసుకోలేదని ఎఫ్డీఐసీ వర్గాలు తెలిపాయి. ఎస్వీబీ, అందులో స్టార్టప్ సంస్థల పెట్టుబడులు, వాటి భవితవ్యం ఇమిడి ఉన్న నేపథ్యంలో సరైన డీల్ ద్వారా సరైన వ్యక్తికి లేదా సంస్థకు బ్యాంకును అప్పగించాలని ఎఫ్డీఐసీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఎస్వీబీకి బెయిల్ ఔట్ ఇచ్చే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ ఆదివారం `ఫేస్ ది నేషన్` కార్యక్రమంలో చెప్పారు. డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తామని, అందుకు బ్యాంకు రెగ్యులేటర్లతో చర్చిస్తూ.. మెరుగైన చర్యల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభానికి, ఎస్వీబీ బ్యాంకు సమస్యకు పరిస్థితులు వేర్వేరని తేల్చేశారు. బ్యాంకును యూఎస్ ఎఫ్డీఐసీ టేకోవర్ చేసే ఆప్షన్ కూడా పరిశీలిస్తున్నదని అధికార వర్గాలు చెప్పాయి.