FATF-India | హవాలా లావాదేవీలు (Money Laundering), ఉగ్రవాదులకు ఆర్థిక సహకార వ్యవస్థలను నిరోధించడానికి భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నదని ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పేర్కొంది. ఆర్థిక మోసాల కేసుల ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు ఉగ్రవాదులకు నిధుల సాయం, హవాలా లావాదేవీల నియంత్రణకు భారత్ తీసుకుంటున్న చర్యలపై ఎఫ్ఏటీఎఫ్ గురువారం నివేదిక విడుదల చేసింది. పారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్ఏటీఎఫ్.. గత జూన్ లో జరిగిన సంస్థ సమావేశంలో భారత్‌పై రూపొందించిన నివేదికకు ఆమోదం తెలిపింది.
ఇంతకుముందు 2010లో మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌లకు భారత్ తీసుకుంటున్న చర్యలపై ఎఫ్ఏటీఎఫ్ మదింపు చేసింది. తిరిగి 2031లో మదింపు చేపట్టనున్నది. గత నవంబర్ నెలలో ఎఫ్ఏటీఎఫ్ ప్రతినిధులు భారత్ లో పర్యటించారు. అయితే, టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ కేసుల ప్రాసిక్యూషన్ వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. స్వచ్ఛంద సంస్థల నుంచి ఉగ్రవాదులకు సాయం అందకుండా చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపింది.