Kisan Vikas Patra | వ్యాపారులైనా.. వేతన జీవులైనా.. మధ్యతరగతి ప్రజలైనా.. సీనియర్ సిటిజన్లయినా.. రిస్క్‌లేని రిటర్న్స్ పొందడానికి సురక్షిత పెట్టుబడి పథకాలు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లు.. సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాలు పాపులర్. ఆ కోవకు చెందిన పథకమే కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ).
ఈ పథకం కింద పోస్టాఫీసులో డిపాజిట్లు చేయొచ్చు. 1988లో అన్నదాతల్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి అప్పటి ప్రభుత్వం ఈ కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, రైతులే కాదు, ఇతర వర్గాల వారు కూడా ఈ పథకం కింద నగదు మదుపు వెసులుబాటు చేసే అవకాశం ఉంది.
మిగతా సేవింగ్స్ కం ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో ఏడు శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తూ ఉంటే.. కేవీపీలో మాత్రం 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ వడ్డీని ఏడాదికోసారి అసలు మొత్తంలో కలుపుతారు. కనుక కేవీపీలో పెట్టుబడిపై చక్రవడ్డీతో కూడిన రిటర్న్స్ అందుకోవచ్చు. అసలు కిసాన్ వికాస్ పత్ర గురించి తెలుసుకుందామా..!
ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీరేట్ల ప్రకారం కిసాన్ వికాస్ పత్రలో చేసిన డిపాజిట్ 124 నెలల్లో అంటే 10 ఏండ్ల నాలుగు నెలలకు రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు రూ.50 వేలు డిపాజిట్ చేశారనుకుందాం. అది పదేండ్ల నాలుగు నెలల గడువు పూర్తయ్యే నాటికి రూ. లక్ష అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీరేటు కంటే ఎక్కువ.
ఇండియన్ సిటిజన్లు కావడంతోపాటు 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద డిపాజిట్ చేయొచ్చు. మైనర్ల పేరు మీద తల్లిదండ్రులు, 18 ఏండ్లు దాటిన వయోజనులు ఈ స్కీమ్ కింద చేరొచ్చు. ట్రస్ట్‌లు కూడా డిపాజిట్ చేయడానికి నిబంధనలు అనుమతిస్తాయి. అయితే, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఎన్నారైలు ఈ పథకం కింద డిపాజిట్ చేయడానికి అనర్హులు. పౌరులు ఒంటరిగా కిసాన్ వికాస్ పత్ర కింద డిపాజిట్ చేయొచ్చు. ఇద్దరు వయోజనులు సంయుక్తంగా చేరొచ్చు.
మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు, ఒడిదొడుకులతో సంబంధం లేకుండా దీర్ఘకాలంలో నికరమైన రిటర్న్స్ పొందొచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై కేంద్ర ఆర్థిక శాఖ వడ్డీరేటును ఖరారు చేస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ముందస్తుగా డిపాజిట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, అప్పటి వరకు వచ్చిన వడ్డీ చెల్లిస్తారు. డిపాజిటర్ మరణిస్తే నామినీకి చెల్లిస్తారు. జాయింట్ ఖాతా కింద ఇద్దరు వ్యక్తులు మదుపు చేస్తే రెండో భాగస్వామికి నిధులు ట్రాన్స్ఫర్ చేస్తారు.
కనీసం రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. అయితే, రూ.50 వేల డిపాజిట్ దాటితే మాత్రం పాన్ నంబర్ నమోదు చేయాలి. ఈ పథకం కింద డిపాజిట్ చేసే వారికి ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఐటీ మినహాయింపు వర్తించదు. ఈ పథకం కింద నిధులు మదుపు చేసిన వారికి పోస్టాఫీసు జారీ చేసే సర్టిఫికెట్‌ను తనఖా పెట్టి రుణాలు కూడా తీసుకోవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లో చేరాలని భావించేవారు పోస్టాఫీసుకెళ్లి ఫామ్-ఏ సమర్పించాలి. ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి చిరునామాగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సమర్పించి, నగదు డిపాజిట్ చేసిన తర్వాత పోస్టాఫీసులో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది పోగొట్టుకుంటే, డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.