Gold Bonds | దేశంలోకి పెరుగుతున్న బంగారం దిగుమతులకు కళ్లెం వేయడానికి, భౌతికంగా పసిడి కొనుగోళ్లకు చెక్‌పెట్టి.. పెట్టుబడులకు ఊతమివ్వడానికి మోదీ సర్కారు గొప్పగా తెచ్చిన పథకం సావరిన్ గోల్డ్ బాండ్లు భారీ వైఫల్యమేనా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం మెడకు గుదిబండలాగే తయారైయ్యాయి మరి. ఎస్‌జీబీలతో ఏకంగా ఖజానాపై రూ.1.12 లక్షల కోట్ల భారం పడుతున్నదిప్పుడు.
బంగారం ధరలపై తప్పుడు అంచనాలు, అవగాహనా లోపం వల్ల కేంద్రంతోపాటు రిజర్వ్ బ్యాంక్ కూడా రిస్క్‌లో పడుతుండటం ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నది.
న్యూఢిల్లీ, మార్చి 25: సంప్రదాయ నగల కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా చూపుతూ సాధారణ మదుపరుల దగ్గర్నుంచి బడా ఇన్వెస్టర్లదాకా అందర్నీ ఆకట్టుకోవాలని సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)పై మోదీ సర్కారు చేసిన ప్రచారం అంతా రివర్సైంది. దేశ, విదేశీ మార్కెట్లలో పరుగులు పెడుతున్న బంగారం ధరలతో ఎస్‌జీబీల్లో పెట్టుబడులపై రాబడులు అమాంతం పెరిగిపోయాయి. గడవు తీరిన బాండ్లకు చెల్లిస్తూపోతే ఇప్పుడున్న ధరల ప్రకారం ఖజానాపై ఏకంగా రూ.1.12 లక్షల కోట్ల భారం పడుతుండటం గమనార్హం. అసలే స్టాక్ మార్కెట్ నష్టాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడుదొడుకుల సమస్యలతో తలలు పట్టుకుంటున్న కేంద్రానికి.. ఎస్‌జీబీల చెల్లింపులు తలకు మించిన భారంగానే పరిణమిస్తున్నదిప్పుడు. మరోవైపు ఈ దెబ్బకు సర్కారీ అప్పులు ఇంకా పెరగవచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో కదలాడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా గత వారం 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు రూ.91,950ని తాకింది. దేశీయ మార్కెట్లో ఇదే ఆల్‌టైమ్ హై. దీని ప్రకారం చూస్తే 2017లో ఎస్జీబీలను కొన్న ఇన్వెస్టర్లకు లాభాల పంట పండినట్టే. ఈ ఏడాది అప్పుడు కొన్న బాండ్లే మెచ్యూరిటీకి వస్తున్నాయి. నాడు తులం రూ.29,667.50గా ఉన్నది. ఇంచుమించుగా ఈ ధరల సగటుపైనే అప్పటి ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లను కొన్నారు. అయితే ఇప్పుడు తులం రూ.90,450గా ఉన్నది. అంటే మూడు రెట్లకుపైగా ధరలు పెరిగాయి. దీంతో అప్పుడు రూ.2,966 పెట్టి గ్రాము కొన్నవారికి కేంద్రం ఇప్పుడు రూ.9,045 ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే సదరు రూ.2,966పై వార్షిక వడ్డీ 2.50 శాతం చొప్పున అదనంగా చెల్లించాలి. ఈ లెక్కన ప్రతీ గ్రాముకు మొత్తంగా దాదాపు రూ.9,700 చెల్లించాలి. 2018, 2019లో ఎస్జీబీలను కొన్నవారికీ ఇంచుమించుగా ఇదే లాభం రానున్నది. ఆ రెండేండ్లూ గ్రాము ధర రూ.3,000-3,500 మధ్యే ఉన్నది. దీంతో ఇప్పుడున్న గరిష్ఠ ధరలకే లాభాలను ఒడిసి పట్టుకోవాలని ఇన్వెస్టర్లు భావిస్తే.. 2017 నుంచి 2019 వరకు కొన్నవారంతా బాండ్లను ప్రభుత్వానికి సమర్పించి నగదు చేసుకోవచ్చు. అదే జరిగితే ఖజానాపై ఒక్కసారిగా వేల కోట్ల రూపాయల భారం తథ్యం. మార్కెట్ ట్రెండ్‌ను చూస్తే ఇప్పట్లో ఈ ధరలు తగ్గేలా లేవు. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ఈ ఏడాది ఆఖరుకల్లా తులం లక్ష రూపాయలకు చేరుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎస్జీబీలను కొన్నవారికి కాసుల వర్షం ఖాయమే.
ఆర్బీఐ లెక్కల్లో..: గోల్డ్ బాండ్లలో ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? అన్న వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టంగా విడుదల చేయలేదు. అయితే 2024 వార్షిక నివేదిక ప్రకారం ఈ పథకం ద్వారా రూ.72,274 కోట్లను కేంద్రం సమీకరించినట్టు తెలుస్తున్నది. ఇది 146.96 టన్నుల బంగారానికి సమానం. చివరిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎస్జీబీలను అమ్మింది. ఇప్పటిదాకా మొత్తం 67 విడుతల్లో గోల్డ్ బాండ్లను జారీ చేసింది. కానీ ఇందులో 6 మాత్రమే ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆ మిగతా 61 విడుతల్లో అమ్మిన బాండ్లు 132 టన్నుల గోల్డ్‌కు సమానమవుతున్నది. దీని విలువ మార్కెట్లో ఇప్పుడు బంగారం ధరలతో చూస్తే రూ.1.12 లక్షల కోట్లుగా తేలుతున్నది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. ఈ చెల్లింపులు చేయాలంటే నెత్తి మీదున్న రుణ భారం ఇంకా పెరగక తప్పదు. మరోవైపు ఏమాత్రం తేడా వచ్చినా ఆర్బీఐ కూడా నమ్మకం పోగొట్టుకుంటుందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
బంగారంతో భారతీయులకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సంపదగానేగాక గౌరవం, హోదాగానూ భావిస్తారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో గోల్డ్‌కు అంత డిమాండ్. దీనికి తగ్గట్టుగానే ఏటా దేశంలోకి 650-1,000 టన్నులు దిగుమతి అవుతున్నది. అయితే ఇందుకు డాలర్ల రూపంలో చెల్లించాల్సి వస్తున్నది. ఇది దేశంలో విదేశీ మారకపు నిల్వలను పడిపోయేలా చేస్తున్నది. 2015లో 34.32 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2024లో 45.54 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2019లో పసిడి దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.88 శాతానికి పెంచారు. 2022లో 15 శాతానికి తీసుకెళ్లారు. అయితే దిగుమతులు తగ్గినా స్మగ్లింగ్ పెరిగిపోయింది. వీటన్నింటి నేపథ్యంలోనే గత పదేండ్లుగా గోల్డ్ బాండ్లను కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తున్నది. భౌతిక బంగారాన్ని కొనే బదులు.. బాండ్లను కొనండంటూ ప్రచారం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అంతకంతకూ ఆసక్తి చూపుతూ వచ్చారు. కానీ పెరుగుతున్న ధరలు.. ఈ బాండ్లను ప్రభుత్వానికి భారంగానే తయారుచేశాయి. నిజానికి ధరలు ఇంతలా పెరుగుతాయని ఊహించని కేంద్రం.. వీటిపై కేవలం 2.5 శాతం వడ్డీనే కాబట్టి రేట్లు ఎంత పెరిగినా లాభమేనని ఊహించింది. కానీ సీన్ రివర్సైంది.