న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. అక్టోబర్ నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న ఎగమతులు ఆ మరుసటి నెలలో ప్రతికూలానికి పడిపోయాయి. గత నెలలో ఎగుమతుల్లో వృద్ధి మైనస్ 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 27 శాతం ఎగబాకి 69.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వంటనూనెలు, ఎరువులు, పసిడి, వెండి దిగుమతులు పుంజుకోవడంతో వాణిజ్యలోటు చారిత్రక గరిష్ఠ స్థాయి 37.48 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఈ సందర్భంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బర్తాల్ మాట్లాడుతూ..చమురు ధరల్లో హెచ్చుతగ్గుదలు కారణంగా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. గత నెలలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 50 శాతం తగ్గి 3.71 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. చమురేతర ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 800 బిలియన్ డాలర్లు అధిగమించే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
పసిడి దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో భారత్ 14.86 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతైంది. క్రితం ఏడాది ఇదే నెలలో చేసుకున్న 3.44 బిలియన్ డాలర్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. ముఖ్యంగా పండుగ సీజన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో బంగారానికి అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 49 శాతం ఎగబాకి 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
గతేడాది ఇది 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నది. బంగారం 25 శాతం వార్షిక రిటర్నులు పంచింది. ప్రస్తుతేడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆస్తులు ఇదే కావడం విశేషం. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, బ్యాంకుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం, పుత్తడిపై దిగుమతి సుంకాలు తగ్గించడం కూడా డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. ప్రస్తుతేడాది బంగారం ధర 23 శాతం ఎగబాకి రూ.78,350కి చేరుకున్నది.