ముంబై/బెంగళూరు, జూన్ 4: బంగారం శుద్ధి, ఆభరణాల మార్కెట్లో దిగ్గజంగా పేరొందిన బెంగళూరుకు చెందిన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్.. భారీ కుంభకోణానికి పాల్పడిందని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆరోపిస్తున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన బడా కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ సంస్థలో ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల ఆర్థిక అవకతవకలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా, సెబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్.. నిజమేనని తేలితే భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో చోటుచేసుకున్న భారీ మోసాల్లో ఇది కూడా ఒకటి అవుతుంది.
2024 మార్చిలో సెబీకి ఓ వాటాదారుడి నుంచి ఫిర్యాదు అందింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి గత కొన్నేండ్లుగా తప్పుడు ఆదాయ ప్రకటనలు వస్తున్నాయన్నది దాని సారాంశం. ఈ క్రమంలోనే సెబీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లను నిర్వహించింది. ఇందులో భాగంగానే బుధవారం ఇందుకు సంబంధించి 109 పేజీల మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. అందులో 2020-21 నుంచి 2024-25 మధ్య సంస్థ ప్రకటించిన ఆర్థిక వివరాలకు, వాస్తవ గణాంకాలకు భారీగా తేడాలున్నట్టు పేర్కొన్నది. కంపెనీ చూపిన ఏకీకృత ఆదాయాల్లో 97-99 శాతం విదేశాల నుంచే వచ్చినట్టున్నది.
ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్‌లోని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ అనుబంధ సంస్థ వాల్కంబీ పేరును ప్రస్తావించింది. అయితే ఆడిటర్లు ఈ సంస్థ ఆదాయం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చెప్పినట్టుగా లేదని గుర్తించారని సెబీ స్పష్టం చేసింది. ఇక 2020-21, 2024-25 మధ్య రూ.15.18 లక్షల కోట్ల ఏకీకృత ఆదాయాన్ని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రకటించింది. ఇందులో రూ.15,15,385 కోట్లు (99.8 శాతం) వాల్కంబీ వంటి విదేశీ అనుబంధ సంస్థల నుంచే పొందినట్టు పేర్కొన్నది. కానీ సెబీ దర్యాప్తులో అది అవాస్తవం అని తేలింది. ఇదిలావుంటే రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్, ఎండీ రాజేశ్ మెహెతా.. సెబీ రిజిస్టర్డ్ బ్రోకరైన అఫ్లూయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జరిపిన లావాదేవీలూ ఉత్తవేనని తెలుస్తున్నది.
అఫ్లూయెన్స్ ద్వారా మెహెతా.. రూ.11,487 కోట్ల విలువైన గోల్డ్ డెరివేటివ్‌లను అమ్మారని, అలాగే రూ.11,488 కోట్ల విలువైన గోల్డ్ డెరివేటివ్‌లను కొన్నారని చూపించారు. అయితే ఈ క్రయవిక్రయాలను అఫ్లూయెన్స్ ఖండించింది. సెబీ దర్యాప్తు అధికారులకు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ అసలు తమ కస్టమరే కాదని అఫ్లూయెన్స్ తెలిపింది. కాగా, ఈ దర్యాప్తులో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తమకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సెబీ అంటున్నది. కస్టమర్ల పూర్తి రికార్డులు, వ్యాపారుల వివరాలు, అనుబంధ సంస్థల ఆర్థిక స్టేట్మెంట్ల వంటి కీలక డాక్యుమెంట్లను ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నది. మరోవైపు సెక్యూరిటీ మార్కెట్లలో లావాదేవీలకు మెహెతాను అనుమతించవద్దని సెబీ ఆదేశించింది. అలాగే తమ దర్యాప్తునకు సహకరించాలని, కోరిన పత్రాలను అందజేయాలని కూడా సూచించింది.
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కుంభకోణం ఆరోపణలతో గురువారం ట్రేడింగ్‌లో ఆ సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి. మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగడంతో ఏకంగా 5 శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో 4.99 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈలో రూ.104.65 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.103.92 వద్ద ముగిశాయి. దీంతో సంస్థ మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.162.38 కోట్లు ఆవిరైపోయి రూ.3,089.90 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఈ దెబ్బకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, దేశీయ అతిపెద్ద సంస్థాగత మదుపరి ఎల్ఐసీ షేర్లూ పడిపోయాయి.
ఈ ఏడాది మార్చినాటికి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్ఐసీ వాటా 10.80 శాతంగా ఉన్నది. నిజానికి మూడేండ్ల క్రిందటి నుంచే విదేశీ సంస్థాగత మదుపర్లు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో వాటాలను తగ్గించుకుంటూపోతున్నారు. 2023 మార్చిలో 17.60 శాతంగా ఉంటే, 2026 మార్చిలో 14.26 శాతానికి వాటాలు తగ్గాయి. కానీ ఎల్ఐసీ మాత్రం అలాగే ఉంచుతూ వస్తున్నది. నష్టాలు వాటిల్లుతున్నా ఉపసంహరణలకు మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో కంపెనీలో ఎల్ఐసీ వాటా విలువ రూ.637 కోట్లుగా ఉంటే.. ఇప్పుడది దాదాపు రూ.347 కోట్లే మరి. ఈ క్రమంలోనే గురువారం కంపెనీ షేర్ వాల్యూ ఎన్ఎస్ఈలో 0.84 శాతం తగ్గి రూ.399.50 వద్ద నిలిచింది. బీఎస్ఈలో 0.97 శాతం నష్టంతో రూ.398. 50గా ఉన్నది.
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాజేశ్ మెహెతా 1964, జూన్ 20న బెంగళూరులో జన్మించారు. చిన్నతనం నుంచే తండ్రి నగల వ్యాపారంపై ఆసక్తి పెంచుకున్న మెహెతా.. పెద్దయ్యాక ఆ దిశగానే అడుగులు వేశారు. సోదరుడు ప్రశాంత్‌తో కలిసి రూ.1,200 రుణంతో ఓ వెండి నగల సంస్థను ప్రారంభించారు. తొలుత దక్షిణ భారతంలో విస్తరించి, ఆ తర్వాత గుజరాత్, ముంబై వంటి మార్కెట్లలోకీ ప్రవేశించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనర్లుగా, ఆభరణాల ఎగుమతిదారులుగా ఎదిగారు. ఇక 1995లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించింది. రూ.100 కోట్లకుపైగా నిధులను సమీకరించి.. రిఫైనింగ్, తయారీ, రిటైలింగ్ రంగాల్లో సంస్థ బలపడింది. 2015లో స్విట్జర్లాండ్‌కు చెందిన బంగారం, తదితర అతి విలువైన లోహాల రిఫైనరీ సంస్థ వాల్కంబీని రూ.3,831.6 కోట్ల (400 మిలియన్ డాలర్లు)కు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కొన్నది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ విస్తరించింది.
సెబీ ఆరోపణలను రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఖండించింది. తాము ప్రకటించిన అన్ని ఆర్థిక వివరాలు సరైనవేనని, వాటిని ఎక్కువగా చూపలేదని స్పష్టం చేసింది. సమాచారం లోపం వల్లే సెబీకి కంపెనీకి మధ్య ఈ గందరగోళం నెలకొన్నదన్నది. అన్నింటిపైనా సెబీకి స్పష్టత ఇచ్చే పనిలోనే ఉన్నామన్న రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్.. కోరిన, కావాల్సిన డాక్యుమెంట్లను అందిస్తున్నామని వెల్లడించింది. ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌తో కంపెనీ సీఎండీ రాజేశ్ మెహెతా మాట్లాడుతూ.. ‘ఆదాయం, స్థూల లాభం విషయంలో సెబీ దర్యాప్తు అధికారులు తికమకపడ్డారు. రూ.15.15 లక్షల కోట్లు మేము పేర్కొన్న ఐదేండ్లలో ఆర్జించిన అసలు ఆదాయమే. అలాగే అఫ్లూయెన్స్తో జరిపిన లావాదేవీలూ నిజమే. ఈ సమాచారాన్ని సెబీకి అందజేశాం. కాబట్టి ఆర్థిక అవకతవకలకు అవకాశమే లేదు. సెబీకి ఉన్న అన్ని సందేహాలను తీర్చుతాం’ అన్నారు.