Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులు.. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలని మెజారిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే మునుపెన్నడూ లేనివిధంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 76,000 మార్కును, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 23,100 స్థాయిని తాకిన విషయం తెలిసిందే. దీంతో ఈ ర్యాలీ వెనుక ఆకర్షణీయమైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, బలమైన ఆర్థికాంశాలున్నాయని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే రిటైల్ ఇన్వెస్టర్లు.. క్వాలిటీ స్టాక్స్‌ను కొనేందుకున్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సలహా ఇస్తున్నారు. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు ఐదేండ్ల క్రితంతో పోల్చితే క్లీన్‌గా ఉన్నాయని, విస్తరణకు వీలు కూడా ఉందంటున్న విశ్లేషకులు.. ఈ కంపెనీల షేర్లలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని కూడా చెప్తున్నారు. కాగా, ఎన్నికలు, ఫలితాల దృష్ట్యా కొద్ది రోజుల వరకు మార్కెట్లలో ఒడిదొడుకులు తప్పవని కూడా పేర్కొంటున్నారు.
ఈ రంగాల్లో..
ఆటోమోటివ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ డిస్క్రీషియనరీ షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కెమిక్సల్ రంగాల షేర్లలోనూ పెట్టుబడులకు వీలున్నది. కాబట్టి ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు, అందుబాటులో ఉన్న నగదు నిల్వలకు, రిస్క్‌ను భరించే స్థాయికి అనుగుణంగా పెట్టుబడులకు వెళ్లవచ్చు. నిజానికి ఈ ఏడాదిలో ఇప్పటిదాకా బీఎస్ఈ సెన్సెక్స్ 4 శాతం వరకు పుంజుకున్నది. భారతీయ ఈక్విటీల్లో నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నా సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరడం కలిసొచ్చే అంశమేనని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు దాదాపు రూ.21,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు మరి.
కంపెనీలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. చాలా సంస్థలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులకే వెళ్లాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)ను పరిశీలించవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని లాభాలను ఆర్జించవచ్చు.
-తేజస్ ఖోడే, ఫీర్స్ వ్యవస్థాపక సీఈవో
స్టాక్ మార్కెట్లు పెరగడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. కనుక ఇది నిలకడైన ర్యాలీగానే చెప్పుకోవచ్చు. మున్ముందు సూచీలు మరింతగా పెరిగే వీలుందనే అనుకుంటున్నా. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగానే భావించవచ్చు. ఇక ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం తక్కువగా ఉన్నది. ఇంకా పెరగాలి.
-ఉపాసన భరద్వాజ్,కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త
పోర్ట్‌ఫోలియోల్లో వైవిధ్యం, బలమైన మూలాలున్న క్వాలిటీ స్టాక్స్‌లో పెట్టుబడులు, ఊహాజనిత ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం వల్ల స్టాక్ మార్కెట్ రిస్క్‌లను మదుపరులు అధిగమించవచ్చు. ముఖ్యంగా స్వల్పకాలిక పెట్టుబడులకు వెళ్లకుండా కనీసం 2-3 ఏైండ్లెనా దీర్ఘకాలిక పెట్టుబడులకు వెళ్లాలి.
-వినాయక్ మెహెతా, ఇన్ఫినిటీ గ్రూప్ వ్యవస్థాపక డైరెక్టర్