MG Motor CUV EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ (MG Motor) భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారు ‘సీయూవీ (CUV)’ వచ్చే ఫెస్టివ్ సీజన్లో ఆవిష్కరించనున్నది. నాలుగేండ్ల క్రితం జడ్ఎస్ ఈవీ (ZS EV), ఇటీవల పలు ఫీచర్లతో కూడిన కంపాక్ట్ ఈవీ ‘కోమెట్ (Comet)’ని తీసుకొచ్చింది. ఓవరాల్ ఎంజీ మోటార్ సేల్స్ లో ఈ రెండు మోడల్ కార్లు గణనీయ వాటా సంపాదించాయి. తాజాగా ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుతో కలిసి ‘సీయూవీ (CUV)’ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నది. త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా మోటార్స్ (Tata Motors) టాటా కర్వ్ (Tata Curvv.ev)కి సీయూవీ గట్టి పోటీ ఇవ్వనున్నదని చెబుతున్నారు. సదరు ‘సీయూవీ (CUV)’కారు రూ.20 లక్షల్లోపు (ఎక్స్ షోరూమ్) ధరకే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
సీయూవీ అంటే క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్ (CUV-Cross Over Utility) కారు తన జడ్ఎస్ ఈవీ కారు మాదిరిగానే 50.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని సమాచారం. ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్ గరిష్టంగా 176 హెచ్‌పీ విద్యుత్, 280 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. మిగతా కార్లతో పోలిస్తే లైట్ వెయిట్ తో వస్తుందని భావిస్తున్నారు. ఈ కారును ఎంజీ మోటార్.. ‘ఇంటెలిజెంట్ సీయూవీ’ అని పిలుస్తోంది. యువతరాన్ని ఆకర్షించేందుకు వీలుగా కూపే తరహా రూఫ్, లార్జ్ వీల్స్, రాప్డ్ బేరింగ్ ది విండోస్, లార్జ్ విండో షీల్డ్ ఉంటాయని తెలుస్తోంది.
ఆలస్యంగా వచ్చినా ఈవీ సేల్స్ లో ఎంజీ మోటార్ స్పూర్తిదాయక వాటా పొందుతోంది. ఈ కారు విక్రయించిన మొత్తం కార్లలో ఈవీ సెగ్మెంట్ 35 శాతం వాటా కలిగి ఉంది. గత మూడు నెలల్లో 500 యూనిట్లు విక్రయించిన జడ్ఎస్ ఈవీ కారు.. ఈ ఏడాది తొలి త్రైమాసికం నుంచి రెండో త్రైమాసికానికి 95 శాతం సేల్స్ పెంచుకున్నది. మొత్తం ఈవీ సేల్స్ లో 39 శాతం గ్రోత్ నమోదు చేసుకుంది. తాజాగా వస్తున్న ఎంజీ సీయూవీ కారు.. ఎంజీ మోటార్స్ సక్సెస్ స్టోరీలో కీలకంగా నిలుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈవీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్‌కు ఎంజీ మోటార్స్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.