న్యూఢిల్లీ, మే 19: విజృంభిస్తున్న ముడి చమురు ధరలు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, పెరుగుతున్న దిగుమతులు.. రూపాయి ఉసురు తీస్తున్నాయి. మంగళవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 50 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది. తొలిసారి 96.70 వద్ద ముగిసింది. వరుసగా ఆరోరోజూ నష్టాలకే పరిమితమైంది. దీంతో పాలకులకు, మదుపర్లకు, వ్యాపార-పారిశ్రామిక వర్గాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత స్థిరమైన కరెన్సీగా వెలుగొందిన రూపీ.. ఇప్పుడు అత్యంత బలహీన కరెన్సీగా నిలుస్తున్నది మరి. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూపీ వాల్యూ దాదాపు 7 శాతం హరించుకుపోయింది. ఇక ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలవగా.. అప్పట్నుంచి గమనిస్తే 6.1 శాతం ఆవిరైపోవడం గమనార్హం. గత ఏడాది ఆఖర్లో 89.88 వద్ద ముగిసిన రూపాయి.. ఇప్పుడు 96.70గా ఉన్నది. దీంతో దాదాపు ఈ 5 నెలల్లో రూపాయి మారకం విలువ 6.82 నష్టపోయింది.
అన్నీ ప్రతికూలతలే..
రూపాయిని బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు.. దేశీయ దిగుమతుల బిల్లును పెంచేస్తోంది. బ్యారెల్ 110 డాలర్లు పలుకుతుండగా.. గత నెలలో క్రూడాయిల్ దిగుమతుల విలువ 18.7 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇందుకు తగ్గట్టే దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగడంతో రూపీ నీరసించిపోతున్నది. మరోవైపు ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం కూడా రూపాయికి నష్టాలను తెచ్చిపెడుతున్నది.
ఆర్బీఐ సైతం పరిమిత స్థాయిలోనే
జోక్యం చేసుకోవాల్సి వస్తుండటంతో ఫలితం లేకుండాపోతున్నది. కరెన్సీ మార్కెట్లో ఇతర కరెన్సీలతో చూస్తే డాలర్ విలువ బలపడుతుండటం కూడా ప్రతికూలంగా మారింది. ఇక చమురు దిగుమతుల్ని ఎలాగూ తగ్గించుకోలేని పరిస్థితి ఉండటంతో, అనవసరపు దిగుమతులైన బంగారం, వెండిని తగ్గించే ప్రయత్నాలను కేంద్రం చేస్తున్నది చూస్తూనే ఉన్నాం.
100కు చేరుతుందా: ఇప్పుడప్పుడే పశ్చిమాసియా సంక్షోభం సద్దుమణిగేలా కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 100కు దిగజారే అవకాశాలు ఎక్కువేనని చెప్పవచ్చు.
ఫారెక్స్ రిజర్వ్‌లపై ఒత్తిడి: రూపాయి విలువ దిగజారినకొద్దీ దేశంలోని విదేశీ మారకం లేదా డాలర్) నిల్వలు కరిగిపోతాయి. దిగుమతులకు డాలర్లలోనే చెల్లించాల్సి వస్తుంది మరి. ఎగుమతుల్ని మించి దిగుమతులుంటే కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది.
కంపెనీలపై భారం: రూపీ వాల్యూ పడిపోతే దేశీయ కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణాలు తడిసి మోపెడవుతాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రభుత్వ రుణాల చెల్లింపులూ పెరిగి ఖజానాపై భారం పడుతుంది.
ఆకాశానికి ధరలు: రూపాయి పతనంతో దేశంలోకి దిగుమతయ్యే ప్రతీ వస్తూత్పత్తి ఖరీదెక్కుతుంది. ముఖ్యంగా ముడి చమురు, ఎరువులు, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, రసాయనాలు, వంటనూనెల ధరలు పరుగులు పెడుతాయి.
రూపీ బలపడుతుందా: చమురు ధరలు, అంతర్జాతీయ పెట్టుబడులపైనే ఆధారపడి ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గితే, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు చల్లారితే, విదేశీ పెట్టుబడులు పెరిగితే, అమెరికా వడ్డీరేట్లు తగ్గితే రూపాయి స్థిరపడవచ్చు.
పెద్ద ముప్పు: రూపాయి పతనం వల్ల ఏర్పడే పెద్ద ముప్పు ద్రవ్యోల్బణం, జీడీపీ క్షీణత. బలహీనపడే రూపాయి విలువ.. ఇంధన ధరల్ని, ద్రవ్య-వాణిజ్య-కరెంట్ ఖాతా లోటులకు దారితీస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడం పాలకులకు సవాలే.
ఎవరికి లాభం: ఎగుమతిదారులకు లాభం. వారికి వచ్చే డాలర్లను రూపాయల్లోకి మార్చినప్పుడు ఎక్కువ నగదు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న భారతీయులు తమ కుటుంబాలకు పంపే డాలర్ల విలువ కూడా పెరుగుతుంది. తమ వారికి ఎక్కువ సొమ్ము అందుతుంది.