హైదరాబాద్, జూన్ 9: హైదరాబాద్‌కు చెందిన ఈవీ స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ తన ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచింది. నగరానికి సమీపంలోని మహేశ్వరం వద్ద ఉన్న ప్లాంట్ కెపాసిటీని 2 లక్షల యూనిట్లకు పెంచుకున్నది. దేశీయంగా కంపెనీకి చెందిన ఈవీలకు డిమాండ్ అధికంగా ఉండటంతో 2.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్ సామర్థ్యం పెంచడంతో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ఎండీ చక్రవర్తి చుక్కపల్లి తెలిపారు. ప్రస్తుతం సంస్థ ప్లాజ్మా, మిలాన్, బిజినెస్ పేర్లతో పలు మాడళ్లను విక్రయిస్తున్నది.
షిప్‌రాకెట్ డార్క్ స్టోర్
హైదరాబాద్, జూన్ 9: దేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన షిప్‌రాకెట్.. హైదరాబాద్‌లో డార్క్ స్కోర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. కస్టమర్లు బుకింగ్ చేసుకున్న వస్తువులను వేగవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో ఈ డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయగా..తాజగా త్వరలో హైదరాబాద్‌తోపాటు చెన్నై, మిగతా నగరాల్లో నెలకొల్పబోతున్నట్లు కంపెనీ సీఈవో అతుల్ మెహతా తెలిపారు. తెలంగాణతోపాటు ఏపీల్లో 18 వేల విక్రయదారులకు సంబంధించిన ఉత్పత్తులను అందుబాటులోవుంచినట్టు చెప్పారు.