Electric Vehicles | న్యూఢిల్లీ, జనవరి 1: విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మాడళ్లపై భారీ రాయితీలను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా రూ.3 లక్షలదాకా రేట్లను తగ్గించడం విశేషం. డిస్కౌంట్లున్న ఈవీల్లో కార్లు, బైకులు కూడా ఉండటం గమనార్హం. సంప్రదాయ ఇంధన (పెట్రోల్ లేదా డీజిల్) ఆధారిత వాహనాలు కాలుష్యానికి దారి తీస్తున్న నేపథ్యంలో అటు వాహనదారులు, ఇటు ప్రభుత్వాలు ఈవీల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నేండ్లుగా ఆటో అమ్మకాల్లో ఈవీల వాటా సైతం పెరిగింది. అయినప్పటికీ ఈవీలపై తయారీదారులు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించడం మారిన మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతున్నది.
ఇదీ సంగతి..
డిమాండ్‌కు మించి పెరిగిన ఉత్పత్తి, డీలర్ల వద్ద పేరుకుపోయిన వాహన నిల్వలు, తగ్గిన విడిభాగాల ధరలు.. మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రేట్లపై డిస్కౌంట్లకు కారణమయ్యాయి. కొత్తగా వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ (కేఫ్) రెగ్యులేషన్లు కూడా ఇప్పుడున్న మాడళ్లపై ధరల తగ్గింపు దిశగా కంపెనీలను నడిపించాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ400, హీరో వీ1 ప్రో-వీ1 ప్లస్, ఏథర్ 450-రిజ్టా మాడళ్లు చౌకయ్యాయని పేర్కొంటున్నాయి. చివరకు ఆన్లైన్ మార్కెటీర్ ఫ్లిప్‌కార్ట్ కూడా ఎలక్ట్రిక్ టూవీలర్లపై రూ.2,500-5,000 మేర ధరల్ని తగ్గించేసింది. ఇక ఈ డిస్కౌంట్లలో ఎక్కువ భాగం వాహన తయారీ సంస్థలు భరిస్తుండగా, మిగతా వాటాను డీలర్లు మోస్తున్నారు. ఎక్సేంజ్ బోనస్‌లు రూ.15,000 వరకు ఇస్తుండగా, ట్రేడ్ డిస్కౌంట్లు రూ.3,000-5,000 మధ్య ఉన్నాయి. మొత్తానికి దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ జోష్‌ను అందిపుచ్చుకున్న వాహన రంగ కంపెనీలు.. పొంగల్, సంక్రాంతి ఉత్సాహాన్నీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి.
ఈ ఏడాది 15 కొత్త మాడల్స్
ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి ఏకంగా 15 కొత్త ఈవీలు రావచ్చని సమాచారం. అందులో మారుతీ సుజుకీ నుంచి ఈ-విటారా కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. ఇక ఇప్పటికే దేశీయ ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న టాటా మోటర్స్ నుంచి సఫారీ, హరియర్ ఈవీ రకాలు రావచ్చని అంటున్నారు. అలాగే సియెర్రా ఈవీ పరిచయం కాబోతున్నట్టు చెప్తున్నారు. ఈ రెండు నెలల్లోనే ఇవి మార్కెట్‌కు వస్తాయని అంచనా. గత ఏడాది పంచ్, కర్వ్ ఈవీలను మార్కెట్లోకి టాటా తీసుకొచ్చిన సంగతి విదితమే. మరోవైపు మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ4ఎక్స్వో ఈవీలు రావచ్చని తెలుస్తోంది. ఇక హ్యుందాయ్ పాపులర్ మాడల్ క్రెటా కూడా ఈవీగా అందుబాటులోకి రాబోతున్నది. కియా ఈవీ5, ఎంజీ సైబర్స్టార్ వంటివి కూడా ఈ లిస్టులో ఉన్నాయి. కాగా, 2030 నాటికి భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్ల వాటా దాదాపు 25 శాతానికి, ఈవీ ప్యాసింజర్ కార్ల వాటా 15 శాతానికి చేరవచ్చని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. మారుతీ, టయోట, హ్యుందాయ్, హీరో, బజాజ్, టీవీఎస్, హోండా తదితర ప్రధాన సంస్థలు ఈవీ మార్కెట్‌పై దృష్టి పెడితే దేశీయ ఈవీ మార్కెట్ పరుగులు పెడుతుందని కూడా వారు విశ్లేషిస్తున్నారు.