EV Charging Stations | దేశంలోని తొమ్మిది మెగా నగరాల్లో గత నాలుగు నెలల్లో విద్యుత్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్లు రెండున్నర రెట్లు పెరిగాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతోపాటు సూరత్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో ఈ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. ఈ తొమ్మిది నగరాల్లో గతేడాది అక్టోబర్ నుంచి 2022 జనవరి వరకు 678 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు అదనంగా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 1640 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. తొలుత 40 లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కేంద్రం కేంద్రీకరించింది.
ఈ దిశగా ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల కల్పన ప్రమాణాలు, మార్గదర్శకాలను కేంద్ర విద్యుత్ శాఖ గత నెల 14న సవరించింది. మరోవైపు దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. పబ్లిక్ ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయస్థాయిలో పెరిగితే దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది.
విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి కేంద్రం పని చేస్తున్నది. బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు అనువైన ప్రాంతాల్లో చార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నాయి.