
EU Face to Face China | డ్రాగన్ను వాణిజ్యపరంగా ఢీకొట్టేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) పథకానికి పోటీగా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి పెట్టుబడులు సమకూర్చేందుకు సిద్ధమని ఈయూ ప్రకటించింది. మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు 340 బిలియన్ల డాలర్ల (300 బిలియన్ల యూరోలు) సమకూర్చనున్నట్లు ప్రకటించింది.
గ్లోబల్ గేట్వే పేరుతో చేపట్టిన ప్రాజెక్టు కోసం 2021-27 మధ్య 300 బిలియన్ల యూరోలను సమకూరుస్తామని తెలిపింది. ఈయూ సభ్యదేశాలు, ఈయూ ఆర్థిక, జాతీయాభివృద్ధి సంస్థల నుంచి ఈ నిధులు సేకరిస్తామని తెలిపింది. ఈయూ తన గ్లోబల్ గేట్ వే ప్లాన్లో చైనా చేపట్టిన దీర్ఘకాలిక అంతర్జాతీయ మౌలిక వసతుల వ్యూహం ఊసే ఎత్తలేదు. కానీ ఈయూ చీఫ్ ఉర్సులా వొన్ డీర్ లెయెన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ప్రధాన పెట్టుబడులకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
అయితే, ఈయూ ప్రతిపాదిత గ్లోబల్ గేట్వే స్కీం కింద సేకరించే నిధులను సభ్య దేశాలు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కీం లక్ష్య సాధనకు అవసరమైతే అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళిక అవసరం అని ఈయూ భావిస్తున్నది.
ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలతో బెటర్ కనెక్టివిటీ కోసం బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ అనే స్కీం పేరిట చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని ప్రారంభించారు. 2020లో 22.5 బిలియన్ డాలర్లతో కలిపి చైనా ఇప్పటి వరకు 139.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. బీఆర్ఐలో భాగంగా ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల మధ్య సముద్ర, రోడ్డు మార్గాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుంది. ఈ మూడు ఖండాల్లో వాణిజ్యం, అభివృద్ధి కోసం చైనాకు భాగస్వామ్య దేశాలు లభించాయి.
ట్రేడ్, డెవలప్మెంట్, కనెక్టివిటీ పేరిట పేద దేశాలను చైనా ప్రలోభ పెడుతుందని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తుంటాయి. అభివృద్ధి చెందున్న దేశాలకు భారీ రుణాలివ్వడంతోపాటు ఆ దేశంలోని ప్రాజెక్టులకు సీక్రెట్ టెండర్లను ఆహ్వానిస్తుందని పాశ్చాత్య దేశాల అభియోగం. తద్వారా డ్రాగన్ అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆరోపణ.కానీ తమ భాగస్వామ్య దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని చైనా సమాధానం ఇస్తున్నది. ఉమ్మడి ప్రాజెక్టులకు లబ్ధి చేకూర్చేలా రుణాలు సమకూరుస్తున్నామంటున్నది. ఇతరదేశాలతో చైనా కాంట్రాక్ట్ నిబంధనలు మానవత్వ, కార్మిక, పర్యావరణ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని విమర్శకుల ఆరోపణ.
కార్నివాల్లో జూన్లో జరిగిన జీ-7 కూటమి దేశాల సదస్సు తర్వాతే చైనా బెల్ట్ అండ్ రోడ్డ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) స్కీంకు సంపన్న దేశాలు ఆల్టర్నేటివ్ ప్రతిపాదించాయి. ఈ క్రమంలోనే ఈయూ గ్లోబల్ గేట్ వే వ్యూహం బయటకు వచ్చింది. 2013-18 మధ్య బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ స్కీంకు తమ డెవలప్మెంట్ ఎయిడ్ చేరువలోకి వచ్చిందని ఈయూ కమిషనర్ జుట్టా ఉర్పిలైనెన్ చెప్పారు.