Personal Finance | పర్సనల్ ఫైనాన్స్‌లో ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో కీలకమైన అంశం. మీ తదనంతరం మీ వారసులకు మీ కష్టార్జితాన్ని సాఫీగా బదిలీ చేయడంలో ఎస్టేట్ ప్లానింగ్దే ప్రధాన పాత్ర. కుటుంబ పెద్ద చనిపోయాక.. ఆ కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాల్లో ఏ స్థాయిలో కొట్లాడుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నవారెందరో. ఇంకొందరైతే ఆస్తి తగాదాలతో కత్తులు దూసుకుంటున్నారు. హత్యలు చేసి జైలుపాలవుతున్నారు. ఈ అనర్థాలన్నింటికీ ఏమాత్రం వీల్లేకుండా ఎస్టేట్ ప్లానింగ్‌తో చెక్ పెట్టవచ్చు.
దేశీయంగా ఆస్తుల పంపకాల్లో విస్తృతంగా వినియోగించేది వీలునామా. స్థిరచరాస్తులను తన మరణానంతరం ఎవరికేది అని వ్రాతపూర్వకంగా నిర్ణయించేదే వీలునామా. అయితే ఏ ఆస్తులనైతే పంచుతున్నారో ఆ ఆస్తుల యజమాని సంతకం దీనిపై ఉండాలి. అంతేగాక ఇద్దరు సాక్షుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగినప్పుడే దానికి విలువ ఉంటుంది.
చాలా సంపన్న కుటుంబాల్లో తమ అత్యంత విలువైన సంపదను లేదా ఆస్తులను వారసులకు ఇవ్వడానికి ముందు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి దానికి ఆ మొత్తాన్ని యజమానులు అప్పగిస్తారు. వారసులు మైనర్లు అయినప్పుడు లేదా దివ్యాంగులై ఇతరుల మీద ఆధారపడినప్పుడు ట్రస్ట్‌ల ఆలోచన సరైనదని చెప్పవచ్చు. ఇక మరికొన్ని సందర్భాల్లో వారసుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కూడా యజమానులు ఈ ట్రస్టులపైనే ఆధారపడుతారు.
ఆస్తుల బదిలీ ప్రక్రియ సజావుగా సాగడానికి నామినీల నమోదు చాలా ముఖ్యం. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీల వంటి ఆర్థిక సాధనాల్లో అప్డేటెడ్ నామినేషన్ కీలకం. అప్పుడే మీ తదనంతరం ఆ సొమ్ము మీరు కోరుకున్నవారికి చెందుతుంది. లేదంటే కుటుంబ తగాదాలు, న్యాయపరమైన చిక్కులు తప్పవు.
ఆస్తులు లేదా బ్యాంక్ ఖాతాలను పిల్లలు లేక భాగస్వామితో కలిసి సంయుక్తంగా నడిపించవచ్చు. జాయింట్ ఓనర్‌షిప్‌తో మరణానంతరం ఆస్తులు, నగదు బదిలీకి మార్గం సుగమమవుతుంది. అయితే కొన్ని పత్రాలు, చట్టాలకు లోబడి ఇదంతా జరుగుతుంది.
అప్డేట్ ఎస్టేట్ ప్లానింగ్ డాక్యుమెంట్లను తరచూ లేదా జీవితంలో కీలక మార్పులు, పరిణామాలు ఎదురైనప్పుడు సమీక్షించుకోవడం అవసరం. న్యాయ, ఆర్థిక నిపుణులు సలహాలతో ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడే న్యాయపరమైన, పన్నులకు సంబంధించిన ఇబ్బందులు దరిచేరవు.