Bank Deposits | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: డిపాజిట్లు ఆకట్టుకోవడంలో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవైపు రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇదే తరుణంలో డిపాజిట్ చేసేవారు తరిగిపోతున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభం నెదుర్కొంటున్నది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంకింగ్ డిపాజిట్లలో 11.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఇదే సమయంలో రుణాల్లో వృద్ధి 15 శాతంగా ఉన్నదని పేర్కొంది.
ఈ రెండింటి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతుండటంపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వుబ్యాంక్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంకింగ్‌లు ప్రత్యేక దృష్టి సారించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగానే విమర్శించారు. ఆకర్షణీయమైన డిపాజిట్లను ప్రకటించాలని సూచించారు. ఈ నెలమొదట్లో ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో సమావేశమై ఈ విషయాన్ని సూచించారు.
గతంలో బ్యాంక్‌లలో డిపాజిట్ చేయడానికి ముందుకొచ్చిన ప్రజలు..ప్రస్తుతం అధిక రిటర్నులు పంచే వాటివైపు మొగ్గుచూపుతున్నారు. దీంట్లో రిస్క్వున్న ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యం గా ఈ ఏడాదికాలంలో డీమ్యాట్ ఖాతాలు పెరిగిందన్న నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నది. ఈ ఏడాదికాలంలో ఈక్విటీలు 14 శాతం రిటర్నులు పంచింది.