High Pension | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సబ్స్క్రైబర్లుగా ఉన్న ఉద్యోగులు, కార్మికుల అధిక పెన్షన్ ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఇందుకు యాజమాన్యంతో కలిసి ఉద్యోగి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలన్న నిబంధన అవరోధంగా మారుతున్నదని విమర్శలు ఉన్నాయి. వయస్సుడిగి పోయిన తర్వాత మెరుగైన పెన్షన్ వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. ఈపీఎఫ్‌వో నిబంధనలతో అందుకు అర్హులైన వారు అటువంటి బెనిఫిట్లు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్ పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు అమలు చేయడానికి ఈపీఎఫ్‌వో పెట్టిన షరతులతో ఎవరూ ఆ అర్హత పొందలేకపోతున్నారు.
పెన్షన్ పొందేందుకు ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో గరిష్ట పరిమితిని మించిన వేతనం (కనీస వేతనం + కరువు భత్యం (డీఏ)) ఉండాలి. వాస్తవ వేతనంపై వారు, యాజమాన్యం ఏండ్ల తరబడి 12 శాతం ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే అధిక పెన్షన్ క్లయిమ్ చేయడానికి ఈపీఎఫ్ యాక్ట్‌లోని 26(6) పేరా ప్రకారం ఈపీఎఫ్‌వో అనుమతి తీసుకోవాలి. అధిక పెన్షన్ కోసం యాజమాన్యంతో కలిసి ఉద్యోగులు ఈపీఎఫ్ యాక్ట్‌లోని 11 (3) పేరా కింద ఆన్లైన్లో ఉమ్మడి ఆప్షన్ దాఖలు చేయాలని షరతు ఉంది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పెన్షన్ పొందే చాన్స్ మిస్ అయ్యే అవకాశాలు కోల్పోతారని చెబుతున్నారు.
2014 సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు ఈపీఎఫ్‌వో చట్టం ప్రకారం రూ.6500, తర్వాత రూ.15 వేలు గరిష్ట వేతన పరిమితిగా ఉంది. ఈ నిబంధనల ప్రకారం గరిష్ట వేతన పరిమితి కంటే ఎక్కువ వేతనం అందుకున్న ఉద్యోగులు, కార్మికులు, వారి యాజమాన్యాలు వాస్తవ వేతనంపై 12 శాతం ప్రీమియం చెల్లించడానికి ఈపీఎఫ్ చట్టంలోని 26 (6) పేరా ప్రకారం ఈపీఎఫ్‌వో పర్మిషన్ తీసుకోవాలి. ఉద్యోగి లేదా కార్మికుడు, వారి యాజమాన్యం అధిక వేతనంపై ప్రీమియం చెల్లింపునకు అంగీకరించడంతోపాటు అవసరమైన ఫీజు పే చేస్తామని పీఎఫ్ సహాయ కమిషనర్‌కు దరఖాస్తు చేసి, పర్మిషన్ తీసుకోవాలి.
కానీ, అధిక వేతనంపై ఈపీఎఫ్ ప్రీమియం చెల్లించడానికి ఈపీఎఫ్ చట్టంలోని 26 (6) పేరా ప్రకారం ఉద్యోగుల్లో అత్యధికులు ఉమ్మడి ఆఫ్షన్ ఇవ్వలేదు. కానీ ఇటు ఉద్యోగులు, అటు యాజమాన్యాలు వాస్తవ వేతనంపై ఈపీఎఫ్‌కు 12 శాతం ప్రీమియం పే చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు అధిక పెన్షన్ పొందడానికి ఉద్యోగులు లేదా కార్మికులు అనుమతించినప్పుడు ఈపీఎఫ్ చట్టంలోని 11(3) పేరా కింద ఉమ్మడి ఆప్షన్ అప్లికేషన్ దరఖాస్తులో 26(6) పేరా ప్రకారం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్లు ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో ఆదేశించింది. అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పెన్షన్ దారులకు అధిక పెన్షన్ రాకుండా చేసేందుకు ఈపీఎఫ్‌వో.. చట్టంలోని 26(6) పేరాను సాకుగా చూపుతుందని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
అధిక పెన్షన్‌పై ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఈపీఎఫ్ చట్టంలోని 26(6) పేరా కింద అధిక వేతనంపై చందా చెల్లించడానికి ఉమ్మడి ఆప్షన్ సమర్పించనవసరం లేదని స్పష్టం చేసింది. తాజా ఆదేశాల్లో ఆన్లైన్ దరఖాస్తు కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.