న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)..అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ డిబెంచర్లలో (బాండ్ల తరహావి) పెట్టుబడి చేసిన రూ. 2,500 కోట్లు రిస్క్‌లో పడ్డాయి. దీంతో రిలయన్స్ క్యాపిటల్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించమంటూ ఈపీఎఫ్‌వో ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ ఈ వివరాలు తెలిపారు. తమ బాండ్లపై రిలయన్స్ క్యాపిటల్ 2019 అక్టోబర్ నుంచి వడ్డీ చెల్లింపులు చేయకుండా డిఫాల్ట్ అయ్యిందని ఈపీఎఫ్‌వో ఫిర్యాదు చేసినట్లు మంత్రి చెప్పారు. కంపెనీ నాన్-కన్వర్ట్‌బుల్ డిబెంచర్లలో (ఎన్సీడీలు)
(సెక్యూర్డ్) ప్రావిడెంట్ ఫండ్ చేసిన పెట్టుబడులపై 2021 నవంబర్ 30 నాటికి రూ.534.64 కోట్ల వడ్డీ రావల్సిఉందని భగవత్ వెల్లడించారు.
ప్రక్రియ ప్రారంభం…
డిఫాల్ట్‌లు, పారదర్శకత లోపించడం వంటి అంశాల కారణంగా ముగిసిన నవంబర్ నెలలో రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రిజర్వ్‌బ్యాంక్ రద్దుచేసింది. కార్పొరేట్ దివాలా ప్రక్రియను ప్రారంభించమంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఆర్బీఐ అప్లికేషన్‌ను ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో రుణదాతలు వారి క్లయింలను డిసెంబర్ 20లోగా సమర్పించాలంటూ కంపెనీ కోరింది. రిలయన్స్ క్యాపిటల్ తన రుణదాతలకు మొత్తం రూ. 19,805 కోట్లు చెల్లించాల్సి ఉంది.