న్యూఢిల్లీ, మే 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులు తమ ఈపీఎఫ్ సొమ్మును మరింత సులువుగా, వేగంగా ఉపసంహరించుకొనే అవకాశం రానున్నది. త్వరలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సభ్యులు ఈపీఎఫ్ ఖాతాల్లోని నగదును నేరుగా తమ బ్యాంక్ అకౌంట్లలోకి బదిలీ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పటికే ఈ మేరకు ప్రయోగం విజయవంతంగా పూర్తిచేసినట్టు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈపీఎఫ్ నగదును వాడుకోవాలని భావించినవారు తమ ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలోకి పరిమితి మేరకు, నిబంధనలకు లోబడి నగదు మొత్తాలను యూపీఐ యాప్స్‌పై పిన్ నంబర్‌ను వినియోగించి సులభంగా పంపించుకోవచ్చన్నారు.
ఆపై ఆ నగదును ఏటీఎంల నుంచి ఎప్పట్లాగే తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాల్లోని నగదును ఉపసంహరించుకోవాలంటే ఆన్లైన్లో విద్య, వివాహ, గృహ, ఆరోగ్య సమస్యల కారణాలను చూపుతూ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తున్నది. దీని పరిష్కారానికి కనీసం 3 నుంచి 5 రోజుల సమయం పడుతున్నది. ఈ క్రమంలో యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణలు సభ్యులకు గొప్ప ఊరటనివ్వనున్నాయి. కాగా, ఈపీఎఫ్ నగదు ఉపసంహరణలను మెరుగుపర్చడానికి ఈపీఎఫ్‌వో గత కొన్నేండ్ల నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ వర్క్‌ను కుదించడమేగాక, ఆన్లైన్ సెటిల్మెంట్లకు వీలు కల్పించింది. ఈ క్రమంలోనే ఆటో-సెటిల్మెంట్ విధానంలో నగదు ఉపసంహరణలకున్న పరిమితిని లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. ఇదిలావుంటే సభ్యులకు మెరుగైన సేవలను అందించేందుకు వాట్సాప్నూ ఈపీఎఫ్‌వో విస్తృతంగా వినియోగించుకోవాలని చూస్తున్నది.