EPFO With Drawal Rule | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు తీపి కబురందించింది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం తమ పీఎఫ్ ఖాతాల్లో నగదు ఉపసంహరణ పరిమితి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు తెలిపింది. 68జే నిబంధన క్రింద ఖాతాదారులు తమ అర్హతను బట్టి విత్ డ్రా చేసుకోవచ్చునని పేర్కొంది.
68జే నిబంధన ప్రకారం ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లు తమ పీఎఫ్ ఖాతా నుంచి తమ వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. కనీసం నెల రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతున్నా, శస్త్రచికిత్స చేయించుకున్నా క్లయిమ్ చేయవచ్చు. పక్షవాతం, క్షయ, క్యానర్, గుండె సంబంధ వ్యాధుల చికిత్స కోసం కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనం ప్లస్ డీఏ గానీ, ఈపీఎఫ్ లో ఉద్యోగి వాటా ప్లస్ వడ్డీల్లో ఏది తక్కువైతే అంత వరకూ విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇందుకు మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఫామ్ 31 కింద పెండ్లిండ్లు, రుణ వాయిదా చెల్లింపులు, ఇల్లు నిర్మాణం తదితరాల కోసం పీఎఫ్ నుంచి పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది. వైద్య ఖర్చుల కోసమైతే సంబంధిత డాక్టర్ ధ్రువీకరణ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. 68హెచ్, 68కే, 68ఎన్, 68ఎన్ఎన్ నిబంధనల కింద కూడా వేర్వేరు కారణాలతో పీఎఫ్ నిధులు పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు నిబంధనలు అనుమతి ఇస్తున్నాయి.