న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఎనర్జీ మేనెజ్మెంట్ అండ్ ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన ఎలక్రామా 2025 సదస్సులో ష్నైడర్ ఎలక్ట్రిక్ సీఈవో ఒలివర్ బ్లూమ్ మాట్లాడుతూ..భారత్‌లో పెట్టుబడుల పరంపర కొనసాగుతున్నదని, భవిష్యత్తులో మరో మూడు ప్లాంట్లను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థకు దేశీయంగా 31 యూనిట్లు ఉండగా, కొత్తగా హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, అహ్మద్‌నగర్‌లలో కొతత ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటికి ఎంతమేర పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
ప్రస్తుతం భారత్..డిజిటలైజేషన్, సైస్టెనబిలిటీ, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వచ్చే 25 ఏండ్లలో వాతావరణ కాలుష్యాన్ని 75 శాతం తగ్గించడానికి టెక్నాలజీ పరంగా కీలక చర్యలు తీసుకుంటున్నట్లు, ముఖ్యంగా డిజిటల్ గ్రిడ్లను ఏర్పాటు చేయడం, ఐవోటీ ఆధారిత విద్యుత్ సరఫరాను చేయడం ద్వారా ఇది సాధ్యమవుతున్నదన్నారు. వచ్చే ఏడాది చివరినాటికి కొత్తగా 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.3,200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు గతంలోనే ప్రకటించింది.