ఐటీ రంగాన్ని భయపెట్టిస్తున్న రాజీనామాలు.. సీనియర్లు అంతా పాత కంపెనీలను ఎందుకు వదిలేస్తున్నారు?
దేశీయ ఐటీ రంగంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ప్రధాన ఐటీ సంస్థల్లో ఉన్నతోద్యోగులు వరుసగా తప్పుకుంటున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ మాజీ హెచ్ఆర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో వెళ్లిపోయారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ఐటీ రంగంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ప్రధాన ఐటీ సంస్థల్లో ఉన్నతోద్యోగులు వరుసగా తప్పుకుంటున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ మాజీ హెచ్ఆర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో వెళ్లిపోయారు. ఇన్ఫీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చార్లెస్ సలామే రాజీనామా చేసిన కేవలం రెండు రోజుల్లోనే లోబో కూడా గుడ్‌బై చెప్పడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిప్పుడు. ఇక అంతకుముందు కూడా టీసీఎస్ సీఈవో పదవి నుంచి రాజేశ్ గోపీనాథన్, ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్స్ హోదాల నుంచి రవికుమార్, మోహిత్ జోషీలు తప్పుకున్న విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూపోతే ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఎందరో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలిగారు. మరికొందరూ అదే బాటలో ఉండటం గమనార్హం.
సీఈవోలుగా అవకాశాలు..
ఏండ్ల తరబడి ఆయా కంపెనీల్లో పనిచేసిన వీరంతా.. ఇతర సంస్థల్లో మెరుగైన అవకాశాలు రావడంతో వెళ్లిపోయేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ఐటీ దిగ్గజాల టాప్ ఆర్డర్ బక్కచిక్కిపోతున్నది. మోహిత్ జోషి విషయానికే వస్తే.. ఇన్ఫోసిస్‌లో 20 ఏండ్లకుపైగా పనిచేశారు. ఆయనకు టెక్ మహీంద్రా ఎండీ, సీఈవోగా అవకాశం వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఐదేండ్లపాటు ఆ పదవిలో ఉంటారు. చార్లెస్ సలామే సైతం కెనడాకు చెందిన సంగోమా టెక్నాలజీస్ కార్పొరేషన్ కొత్త సీఈవోగా అవకాశాన్ని పొందారు. ఇక రవికుమార్ కాగ్నిజెంట్ సీఈవోగా నియమితులయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్ (సీఐఎస్వో) విశాల్ సల్వీ రాజీనామా చేసి గత నెల సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్‌హీల్ కొత్త సీఈవోగా చేరారు.
చిన్న కంపెనీలకు కొత్త నాయకత్వం
పెద్ద కంపెనీల్లోని సీనియర్ స్థాయి ఉన్నతోద్యోగుల వరుస రాజీనామాల మధ్య ఎన్నో చిన్న కంపెనీలకు కొత్త నాయకత్వం వస్తున్నది. సైయెంట్ సర్వీసెస్, జోరియంట్, ఎంకోరా, ఆర్ సిస్టమ్స్, సిటియస్ టెక్, ఎక్లెక్స్ తదితర ఐటీ సంస్థలకు నూతన సీఈవోలు వస్తున్నారు. ఇలా వస్తున్నవారంతా ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి బడా సంస్థల్లో ఎంతోకాలం నుంచి పనిచేసినవారే. అక్కడ సీఈవో హోదాకు దిగువ స్థాయిల్లో పని చేయగా.. చిన్న కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని ఖాయం చేసుకునే వీడుతున్నారు. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను మినహాయిస్తే.. తొమ్మిది ఐటీ కంపెనీలకు సీఈవోగా వస్తున్నవారు ఇతర పెద్ద కంపెనీల నుంచి వస్తున్నవారే. టీసీఎస్ కొత్త సీఈవోగా ఆ సంస్థకే చెందిన కే కృతివాసన్ పదోన్నతి అందుకున్న సంగతి విదితమే. 20 ఏండ్లుగా విప్రోలో ఉన్న గుర్విందర్ సాహ్నీ.. ఈ ఏడాది మే నెలలో పర్సిస్టెంట్ సిస్టమ్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా వెళ్లిపోయారు.
- ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే టాప్-5 ఐటీ కంపెనీల్లో 23 శాతం నుంచి 13 శాతానికి దిగిన సగటు అట్రిషన్ రేటు.
- సంస్థాగతంగా మార్పులు తెస్తున్న కొత్త సీఈవోలు. గత నెల కాగ్నిజెంట్ నయా బాస్.. ఆరుగురు మహిళా సీనియర్ ఉపాధ్యక్షురాళ్లను నియమించారు.
- కొత్త సీఈవో సారథ్యంలో టీసీఎస్ సైతం ఆయా రంగాలు, దేశాల ఆధారంగా తమ బిజినెస్ గ్రూప్‌లను ప్రకటించేందుకు రెడీ అవుతున్నది.
- టెక్ మహీంద్రాకు రాబోతున్న సీఈవో మోహిత్ జోషీ కూడా సరికొత్త పంథాను అవలంభించాలని చూస్తున్నారు. కంపెనీ క్లయింట్లు, ఉద్యోగులతో తరచూ సమావేశమవుతున్నారు.
‘గడిచిన ఏడు నెలల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రోలకు చెందిన తొమ్మిది మంది ఉన్నతోద్యోగులు.. అంతర్జాతీయ ఐటీ సంస్థలు లేదా భారత్‌లోని ఇతర ఐటీ కంపెనీల్లోకి సీఈవోలుగా వెళ్లిపోయారు. గత ఏడాది దేశీయ ఐటీ పరిశ్రమ ఆరుగురు కొత్త సీఈవోలను చూసింది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 10 మంది కొత్త సీఈవోలు వచ్చారు. అయితే ఇతర సంస్థలకు సీఈవోలుగా వెళ్లడానికే ఇప్పుడున్న పెద్ద సంస్థలను అంతా వీడటం లేదు. కుదిరితే సీఈవోగా లేదంటే ప్రస్తుతమున్న హోదా కంటే ఎక్కువ స్థానానికి వెళ్లినా చాలని అనుకుంటున్నారు. అందుకే ఆశించిన స్థాయిలో కంపెనీలో ప్రగతిని చూడలేకపోతున్నవారు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.’
–పరీఖ్ జైన్, పరీఖ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు
‘భారతీయ ఐటీ ఇండస్ట్రీ కొత్తకొత్త మార్పులకు లోనవుతున్నది. అయితే ప్రస్తుత పోటీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఏం చేయాలి, ప్రత్యర్థి సంస్థలపై ఎలా పైచేయి సాధించాలన్న దానిపై నూతన సీఈవోలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పనిని మరింత వేగంగా, కొత్తగా చేసేందుకున్న మార్గాలనూ అన్వేషించాలి.’
–పీటర్ బెండర్-సామ్యూల్,ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

